గన్నవరం: సోషల్ మీడియా వేదికగా సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా తన వీడియో, ఆడియోలను మార్ఫింగ్ చేసి అసత్య ప్రచారాలు చేస్తున్న వ్యక్తులపై న్యాయ పరమైన చర్యలు తీసుకుంటానని గన్నవరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ హెచ్చరించారు. ఈ మేరకు గురువారం గన్నవరం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఆయన గతంలో పీజీఆర్‌ఎస్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు యూట్యూబ్‌లో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై సెక్షన్ 94 బీఎన్‌ఎస్‌ఎస్ కింద నోటీసులు జారీచేయాలని కోరారు. కొంత కాలంగా తనను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో కొంత మంది విష ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది జనవరి 21న అనారోగ్యంతో బాధపడుతున్న యలమంచిలి జయప్రకాష్‌ను పరామర్శించేందుకు వెళ్లినట్లు చెప్పారు. మరికొంత మందితో కూర్చుని ఉండగా రహస్యంగా వీడియోలు తీసి మావిగన్ ప్రతిపాదనను తప్పు పట్టినట్లు, తమ పార్టీ అధినేతను దూషించినట్లుగా వీడియో, ఆడియోలు మార్ఫింగ్ చేసి యూట్యూబ్‌లో వైరల్ చేస్తున్నారని విమర్శించారు. అసలు మావిగన్ ప్రతిపాదన అప్పటికీ బయటకు రాలేదని చెప్పారు. అయినప్పటికి ఓ పథకం ప్రకారం తనపై తప్పుడు ప్రచారం చేస్తూ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర జరుగుతోందన్నారు. గతంలోనూ దుష్ప్రచారాలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం తనకు ప్రాణహాని ఉందని, ప్రభుత్వం నుంచి సరైన రక్షణ కూడా కల్పించడం లేదని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చట్ట పరమైన చర్యలు తీసుకునేందుకు సీఐ బి.వి.శివప్రసాద్ నిరాకరించారు. కనీసం యూట్యూబ్ నుంచి సదరు వీడియో, ఆడియోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్న అప్‌లోడర్ వివరాలు పొందడానికి బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 94 కింద నోటీసులు జారీ చేసేందుకు కూడా సీఐ అంగీకారం తెలపలేదు. దీనిపై వంశీమోహన్‌తో పాటు ఆయన న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలుత పోలీసులు తమకు అనుకూలంగా ముందుగా సిద్ధం చేసిన స్టేట్‌మెంట్‌పై సంతకాలు చేయాలని వంశీమోహన్‌ను కోరగా నిరాకరించారు. దీంతో సీఐ స్వయంగా వంశీమోహన్ నుంచి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసుకున్నారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీమోహన్


