అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం
బెన్‌డిక్ట్ స్కూల్ వద్ద మద్యం దుకాణం తొలగించాలి
కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వస్తున్న దరఖాస్తులకు అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోని ఏవీఎస్‌రెడ్డి కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్), పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో రెవెన్యూ క్లినిక్ జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ.. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్దేశించిన గడువులోగా ప్రతి సమస్యను పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై సంబంధిత శాఖాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించారు. రెవెన్యూ, రెవెన్యూయేతర దరఖాస్తులను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పరిష్కరించాలన్నారు. అర్జీల పరిష్కారంపై క్షేత్రస్థాయి అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ సత్వర పరిష్కారానికి కృషిచేయాలన్నారు.
పీజీఆర్‌ఎస్‌కు 145 అర్జీలు
జిల్లాస్థాయి కార్యక్రమానికి 145 అర్జీలు వచ్చాయని కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. వీటిలో 62 రెవెన్యూ, 83 రెవెన్యూయేతర అర్జీలు ఉన్నాయన్నారు. రెవెన్యూయేతర అర్జీల్లో పురపాలక శాఖకు 24, పోలీసు శాఖకు 18, డీఆర్‌డీఏకు 7, గృహనిర్మాణానికి ఆరు అర్జీలు వచ్చాయి. పంచాయతీరాజ్‌కు 4, వ్యవసాయ, ఆరోగ్య శాఖలకు మూడు చొప్పున అర్జీలు అందాయి. విద్య, మార్కెటింగ్, విభిన్న ప్రతిభావంతులు, రహదారులు–భవనాలు, ఆర్‌ఐవోకు రెండు చొప్పున అర్జీలు వచ్చాయి. విద్యుత్, ప్రజా రవాణా, ఎండోమెంట్, పశుసంవర్థక, డ్వామా, అడవులు, గ్రామీణ నీటి సరఫరా, నైపుణ్యాభివృద్ధి విభాగాలకు ఒక్కొక్కటి చొప్పున అర్జీలు వచ్చాయన్నారు.
విజయవాడ రూరల్ మండలం, కొత్తూరు తాడేపల్లిలోని డెన్‌డిక్ట్ హైస్కూల్‌కు వివిధ గ్రామాల నుంచి 1,100 మంది విద్యార్థులు వస్తున్నారు. స్కూల్ సమీపంలోని మామిడి తోటలో మద్యం దుకాణం ఏర్పాటు చేశారు. మద్యం సేవించిన వ్యక్తులు స్కూల్ ఎదురుగా ఉన్న కొండవాగు వంతెనపై కూర్చుని అల్లరి చేస్తున్నారు. స్కూల్ పిల్లలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా మద్యం షాపు తొలగించాలని పీజీఆర్‌ఎస్‌లో జమలయ్య అర్జీ సమర్పించారు.
ఎం. జమలయ్య, కొత్తూరు తాడేపల్లి


