సమస్యలపై చర్చ జరిగేనా?
నేడు జెడ్పీలో డీఆర్సీ సమావేశం తొమ్మిది నెలల తరువాత నిర్వహణ తూతూ మంత్రంగా గత సమావేశం ఈ సారైనా అధికార పక్షం సమస్యలపై దృష్టిసారించేనా?
జిల్లా అధికారులు
బందరులోనే ఉండాలి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా సమీక్ష సమావేశం (డీఆర్సీ) తొమ్మిది నెలల తరువాత శుక్రవారం జరగనుంది. గత డీఆర్సీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు సమాచారాన్ని సంబంధిత అధికారులు మంత్రులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాల్సి ఉంది. తొమ్మిది నెలల తరువాత డీఆర్సీ సమావేశం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఇది మూడో సమావేశం. గత డీఆర్సీ తూతూమంత్రంగా సాగింది. ఈ సమావేశంలో అయినా ప్రస్తుతం జిల్లాలో ఎదుర్కొంటున్న ప్రజల సమస్యలపై చర్చ జరుగుతుందో లేదోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ సమావేశం అజెండాలో వ్యవసాయ అనుబంధ శాఖలతో పాటు విద్య, వైద్యం, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు, గృహనిర్మాణం, పరిశ్రమలు తదితర శాఖలకు సంబంధించి అంశాలను పొందుపరిచారు.
రైతుల సమస్యలపై చర్చ సాగేనా..?
జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ అధ్యక్షతన మధ్యాహ్నం రెండు గంటలకు డీఆర్సీ జరగనుంది. మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యే ఈ సమావేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై చర్చ జరిగేనా అని జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. పంట కోతకొచ్చే సమయంలో మోంథా తుపాను ప్రభావం వల్ల జిల్లాలోని చాలా మండలాల్లో ఈదురుగాలులకు పైరు నేలవాలింది. ధాన్యం రాశులు వర్షానికి తడిచిపోయాయి. దీంతో ధాన్యంలో తేమ శాతం రైతులను వేధించింది. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించాలని రైతులు పోరాటం చేసినప్పటికీ తేమశాతం తగ్గిస్తేనే కొనంటామని అధికారులు తెగేసి చెప్పారు. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాక్షాత్తూ మంత్రి కొలుసు పార్థసారథి ఇటీవల జిల్లాలో పర్యటించినప్పుడు ధాన్యం కొనుగోళ్లపై రైతులు నిలదీశారు. ఇప్పటికీ జిల్లాలో సగానికిపైగా ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ధాన్యం సేకరణ, రైతుల ఇబ్బందులపై ఈ సమావేశంలో చర్చ జరుగుతుందో, లేదో వేచి చూడల్సి ఉంది. జిల్లాలోని ప్రతి మిల్లులో తేమశాతం తగ్గించేందుకు డ్రయ్యర్లు ఏర్పాటు చేయాలని గత సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు.
వలసలపై చర్యలేవి?
కృష్ణాజిల్లా నుంచి పేదలు ఎక్కువగా వలస వెళ్తున్నారని, దీనిపై జిల్లా యంత్రాంగం దృష్టి సారిం చటం లేదని గత సమావేశం దృష్టికి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీసుకువచ్చారు. జిల్లాలో అన్యాక్రాంతమైన భూములపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో కలెక్టర్ వివరించాల్సిన అవసరం ఉందని యార్లగడ్డ సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడలేని మనం ఇలా సమావేశాలు నిర్వహించటం వృథా అని ఆయన తేల్చి చెప్పారు. పశుసంవర్ధకశాఖపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. గత సమావేశంలో చర్చించిన అంశాలపై ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారో వెల్లడించాల్సిన అవసరం ఉంది.
అన్నిశాఖల అధికారులందరూ జిల్లా కేంద్రమైన బందరులో కచ్చితంగా ఉండాల్సిందేనని మంత్రి కొల్లు రవీంద్ర గత సమావేశంలో స్పష్టంచేశారు. ఈ విషయంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. అయినప్పటికీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వోతో పాటు కొంతమంది అధికా రులు తప్ప ఎక్కువశాతం అధికారులు ఇప్పటికీ విజయవాడ నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. మంత్రి సూచనలు, కలెక్టర్ ఆదేశాలను అధికారులు పట్టించుకోవడంలేదు. అధికారులు జిల్లా కేంద్రంలో నివాసం ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటే సమస్యల పరిష్కారంలో చొరవ చూపొచ్చని గత సమావేశంలో ప్రజాప్రతినిధులు సూచించిన నేపథ్యంలో అటువంటివి ఏమీ ప్రస్తుతం జరగటం లేదు. ఈ సమావేశంలో ఈ విషయంపై ఎంత మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేస్తారో చూడాల్సి ఉంది.


