దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.4.49 కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): భవానీ దీక్షల విరమణ ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మకు భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల ద్వారా రూ.4.49 కోట్ల ఆదాయం సమకూరింది. గురువారం జరిగిన కానుకల లెక్కింపులో రూ.3,21,22,542 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై మహా మండపం ఆరో అంతస్తులో కానుకలు లెక్కించారు. బుధవారం జరిగిన కానుకల లెక్కింపులో రూ.1,27,90,645 కోట్ల ఆదాయం వచింది. రెండు రోజుల్లో రూ.4,49,13,187 నగదు, 218 గ్రాముల బంగారం, 17.324 కిలోల వెండి సమకూరింది. 190 యూఎస్‌ఏ డాలర్లు, 25 కెనడా డాలర్లు, 15 యూఏఈ దిర్హమ్స్, 23 మలేరియా రింగట్స్, 101 ఖత్తర్ రియాన్స్, 100.5 ఓమన్ బైంసాలు లభించాయి. కానుకల లెక్కింపును ఆలయ ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యులు పర్యవేక్షించగా, దేవస్థాన సిబ్బంది, సేవా సిబ్బంది పాల్గొన్నారు.
మచిలీపట్నం – ప్రయాగ్‌రాజ్ మధ్య ప్రత్యేక రైలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల డిమాండ్ మేరకు మచిలీపట్నం – ప్రయాగ్‌రాజ్ మధ్య ప్రత్యేక వన్ వే రైలు నడపనున్నట్లు విజయవాడ డివిజన్ పీఆర్‌ఓ నుస్రత్ మండ్రు ప్కర్ గురువారం ఒక ప్రకటలో తెలిపారు. ఈ నెల 22న సాయంత్రం 4.20 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి, 24న తెల్లవారుజాము 4.30 గంటలకు ప్రయాగ్‌రాజ్ చేరుతుంది. ఈ రైలు గుడివాడ, విజయవాడ, ఖమ్మం, వరంగల్లు, పెద్దపల్లి, మాచర్ల, సిర్‌పూర్ కాగజ్‌నగర్, బల్హార్షా, చంద్రాపూర్, నాగ్‌పూర్, బినా, వీరంగన లక్ష్మీభాయ్ జంక్షన్, ఒరై, గోవింద్‌పురి స్టేషన్‌ల మీదుగా ప్రయాణిస్తుంది.
విజయవాడ–కాచిగూడ ప్రత్యేక రైలు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ – కాచిగూడ మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు నుస్రత్ మండ్రుప్కర్ తెలిపారు. ఈ నెల 20న రాత్రి 9.30 గంటలకు విజయవాడలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.25 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి స్టేషన్ మీదుగా కాచిగూడ చేరుకుంటుంది.
పల్స్ పోలియోను
విజయవంతం చేద్దాం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఈ నెల 21వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిద్దామని ఎన్టీఆర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని అన్నారు. పల్స్ పోలియోపై యూపీ హెచ్‌సీ వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు, ఏఎన్ ఎంలు, బూత్ వలంటీర్లకు తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో గురువారం శిక్షణ ఇచ్చారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ.. అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కల మందు వేయాలని స్పష్టంచేశారు. తీవ్రమైన జలుబు, దగ్గు, జ్వరం ఉన్నప్పుడు మాత్రమే వైద్యుడి సంప్రదించా లని సూచించారు. జిల్లాలో 966 పోలియో బూత్‌లలో 2,48,900 మంది పిల్లలకు చుక్కల మందు వేయాలన్నది లక్ష్యమని వివరించారు. ఈ సమావేశంలో వీఎంసీ సీఎంఓహెచ్ డాక్టర్ అర్జునరావు, ఏఎంఓహెచ్ డాక్టర్ బాబుశ్రీనివాసరావు, డాక్టర్ గోపాలకృష్ణ, డీఐఓ డాక్టర్ శరత్ తదితరులు పాల్గొన్నారు.
నేడు జిల్లా స్థాయి సైన్స్‌ఫెయిర్
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన నగరంలోని సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాల(గుణదల)లో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన (సైన్స్ ఫెయిర్)ను నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులలో శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మకత, ఆవిష్కరణలను ప్రొత్సహించే లక్ష్యంతో వివిధ స్థాయిల్లో వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అందులో భాగంగా పాఠశాల, మండల స్థాయిలో నిర్వహించిన విజేతలతో జిల్లా స్థాయి ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన నమూనాలను రాష్ట్ర స్థాయిలో, అక్కడ విజేతలుగా నిలిచిన వారిని జాతీయ స్థాయికి పంపిస్తామని వివరించారు. మండల స్థాయిలో గ్రూప్ ఎగ్జిబిట్స్ ఏడు చొప్పున, విద్యార్థుల వ్యక్తిగత ఎగ్జిబిట్స్ రెండు, ఉపాధ్యాయులు వ్యక్తిగత ఎగ్జిబిట్స్ రెండు చొప్పున ప్రదర్శనలో ఉంటా యని వివరించారు.


