జీవితాలతో బెట్టింగ్ ఆట
సంక్రాంతి సంబరాల పేరుతో చిన్నారులను ఆకర్షించేలా బెట్టింగ్ గేమ్‌లు కోడిపందేల శిబిరాల వద్దకు భారీగా చేరుకుంటున్న చిన్నారులు, యువకులు సరదాగా మొదలై బెట్టింగ్ గేమ్‌లకు బానిసలుగా మారుతున్న వైనం తల్లిదండ్రులు అప్రమత్తంగా లేకుంటేబిడ్డల భవిష్యత్తు ప్రశ్నార్థకమే..
జి.కొండూరు: సంక్రాంతి సంబరాలు అంటూ నిర్వహిస్తున్న కోడిపందేల శిబిరాల వద్ద బెట్టింగ్ క్రీడలు జోరుగా సాగుతున్నాయి. శిబిరాల వద్దకు సరదాగా గడిపేందుకు వస్తున్న చిన్నారులు, యువకులను బెట్టింగ్ క్రీడలు ఆకర్షిస్తున్నాయి. పండుగ మూడు రోజుల సెలవుల్లో యువకులు, చిన్నారులు సరదాగా బెట్టింగ్ గేమ్‌లను ఆడడం పరిపాటిగా మారింది. ఈ సరదా వారిని బెట్టింగ్‌లకు బానిసగా మారుస్తోంది. చిన్న వయస్సులోనే ఆన్‌లైన్ గేమ్‌లు, బెట్టింగ్‌లకు అటవాటు పడిన యువకులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవడం, హత్యలు, చోరీలకు తెగబడుతున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి.
గతేడాది జిల్లాలో 70కిపైగా శిబిరాలు
ఎన్టీఆర్ జిల్లాలో గతేడాది సంక్రాంతి సంబరాల పేరుతో అనధికారికంగా 70కిపైగా కోడిపేందేల శిబిరాలు నడిచాయి. ఈ శిబిరాల ఏర్పాటుకు ముడుపులు, అద్దెల కోసం భారీగా ఖర్చు పెడుతున్న నిర్వాహకులు ఆ మొత్తాన్ని రాబట్టుకునేందుకు పేకాటతో పాటు బెట్టింగ్ గేమ్‌లకు విచ్చలవిడిగా అనుమతినిచ్చారు. కోడిపందేలు నేరమని కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ సంప్రదాయం పేరుతో ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంతో పోలీసులు అటు వైపు వెళ్లే అవకాశం లేకుండా పో యింది. కోడిపందేల శిబిరాల నిర్వాహకులు ఆదాయం కోసం బెట్టింగ్ గేమ్‌లకు అనుమతి ఇవ్వడంతో మూడు రోజులు పాటు చిన్నారులు, యువకులు పేకాట, కోసు ఆట, లోన – బయట, రాజు – రాణి, నలుపు – తెలుపు, బొమ్మలాట, నంబర్లాట, చిన్న బజారు – పెద్ద బజారు, మూడు ముక్కలాట, బొమ్మాబొరుసు వంటి ఆటలు ఆడుతూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ సరదా సంక్రాంతి సంబరాలు ముగిశాక ఆన్‌లైన్ గేమ్‌లు, క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడేలా చేస్తోంది. బెట్టింగ్‌లకు డబ్బుల కోసం లోన్ యాప్‌ల నుంచి అప్పులు చేయడం, డబ్బు దొరకనప్పుడు చోరీలు, ఇతర నేరాలకు పాల్పడటం వంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి.
వెలుగు చూసిన ఘటనల్లో కొన్ని..
జీవితాలతో బెట్టింగ్ ఆట


