
యువతకు హెచ్‌ఐవీపై అవగాహన అవసరం
ఏపీశాక్స్ ప్రాజెక్టు డైరెక్టర్
డాక్టర్ నీలకంఠరెడ్డి
మధురానగర్(విజయవాడసెంట్రల్): యువత హెచ్‌ఐవీ ఎయిడ్స్‌పై అవగాహన పెంపొందించుకోవటంతో పాటు హెచ్‌ఐవీ సోకిన వారిని ఆదరించాలని ఏపీ శాక్స్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ నీలకంఠరెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో శుక్రవారం జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారంతో ఆంధ్ర ప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యాన రాష్ట్రస్థాయి 5కే మారథాన్ కార్యక్రమం జరిగింది. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి 5కే మారథాన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్‌ఐవీ సోకిన వారు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఏఆర్టీ చికిత్సతో వారి జీవన ప్రమాణం పెంచుకోవచ్చని అన్నారు. హెచ్‌ఐవీ వ్యాధి సోకిన వారిపై వివక్ష నివారణ గురించి అవగాహన కల్పించడానికి ఐఈసీ క్యాంపెయిన్ ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టామని వివరించారు.
బహుమతుల ప్రదానం..
5కే మారథాన్ మహిళలు, పురుషులు, ట్రాన్స్‌జెండర్ విభాగాలవారీగా పోటీలు నిర్వహించారు. జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన వారికి ఇక్కడ రాష్ట్రస్థాయి మారథాన్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఇక్కడ పోటీలలో గెలిచిన వారిని జాతీయ స్థాయి పోటీలకు పంపించటంతో పాటు వరుసగా రూ. 35వేలు, రూ.25వేలు, రూ.10వేలు నగదు బహుమతి అందింస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఏపీడీ డాక్టర్ కె. సుచిత్ర, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అంకినీడు ప్రసాద్, డాక్టర్ టి. మంజుల, ఎన్టీఆర్ జిల్లా ఎయిడ్స్, టీబీ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ బి. భాను నాయక్ తదితరులు పాల్గొన్నారు.