
నిర్లక్ష్యం నీడలో ఎత్తిపోతల పథకాలు!
నిరుపయోగంగా ఉన్న వెల్లటూరు, కందులపాడు పథకాలు రూ.1.50 కోట్లతో పోలవరం కుడికాల్వపై నిర్మాణం మోటార్లు పని చేయక నీళ్లున్నా ఎత్తిపోయలేని వైనం
జి.కొండూరు: కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. నీటి లభ్యత ఉండి కూడా ఎత్తిపోయలేని స్థితిలో ఎత్తిపోతల పథకాలు ఉండడంతో రైతులకు తలనొప్పిగా మారింది. ప్రస్తుతానికి చెరువుల్లో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ ఎత్తిపోతల పథకాలు సంవత్సరాల తరబడి నిరుపయోగంగా పడి ఉండడంతో నీటి ఎద్దడి సమయంలో సమస్య తలెత్తే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఎత్తిపోతల పథకాలను వాడుకలోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. వెలగలేరు వద్ద పోలవరం కుడి కాల్వపై ఒకే ప్రదేశంలో నిర్మించిన వెల్లటూరు, కందులపాడు ఎత్తిపోతల పథకాలు నిర్వహణా లోపంతో ఏడాదిన్నరగా మూలనపడ్డాయి. వెల్లటూరు ఎత్తిపోతల పథకాన్ని రూ.109.10 లక్షలతో ఆ గ్రామ శివారులో ఉన్న బంధు చెరువుకు నీటి సరఫరా చేసేలా నిర్మించారు. ఈ చెరువు విస్తీర్ణం 125.32ఎకరాలు కాగా ఈ చెరువు కింద గ్రామానికి చెందిన 312.92 ఎకరాలు ఆయకట్టుగా ఉంది. ఈ చెరువుకు సాగర్ జలాలు వస్తే తప్ప వర్షాధారం లేదా ఈ ఎత్తిపోతల పథకమే ఆధారంగా ఉంది. ఈ ఎత్తిపోతల పథకంలో రెండు మోటార్లను నీటిలో ఉండి పని చేసే విధంగా అమర్చారు. అయితే ఈ రెండు మోటార్లు ఏడాదిన్నరగా పనిచేయడంలేదని రైతులు చెబుతున్నారు. అదేవిధంగా కందులపాడు ఎత్తిపోతల పథకాన్ని రూ.40.57లక్షలతో శివారు గ్రామం చేగిరెడ్డిపాడు వీరయ్య చెరువుకు నీటిని సరఫరా చేసేలా నిర్మించారు. ఈ చెరువు విస్తీర్ణం 67.53 ఎకరాలు కాగా గ్రామానికి చెందిన 138.95 ఎకరాలు ఆయకట్టు సాగుభూమిగా ఉంది. అయితే ఈ రెండు ఎత్తిపోతల పథకాలు కూడా గత ఏడాదిన్నరకుపైగా నిరుపయోగంగా ఉండడంతో ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంలో వరి నారుమళ్లకు నీరందక రైతులు నరకయాతన పడ్డారు. కొన్ని చోట్ల నారుమళ్లు ఎండిపోవడంతో రైతులు చేసేది లేక వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేపట్టారు.
అధ్వానంగా పరికరాలు..
ఈ రెండు ఎత్తిపోతల పథకాలు ఏడాదిన్నరగా నిర్వహణా లోపంతో అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. ఖరీదైన మోటార్లు, ఎలక్ట్రికల్ బోర్డులు నిరుపయోగంగా ఉన్నాయి. వీటి కోసం నిర్మించిన షెడ్‌ల వద్ద భారీగా ముళ్ల కంప పెరిగి కనీసం దగ్గరకు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ షెడ్లకు ఉన్న డోర్లకు తాళాలు కూడా లేకపోవడంతో ఎలక్ట్రికల్ బోర్డులు, మోటార్ల భద్రత కూడా ప్రశ్నార్ధకంగా మారింది.
నీళ్లున్నా ఎత్తిపోయలేని పరిస్థితి...
ఈ రెండు ఎత్తిపోతల పథకాలను వెలగలేరు గ్రామ శివారులో పోలవరం కుడి కాల్వపై నిర్మించారు. అయితే ఈ ఎత్తిపోతల పథకాలను నిర్మించిన ప్రదేశంలో పోలవరం కాల్వపై రెగ్యులేటర్ కూడా ఉండడంతో ఇక్కడ నిత్యం నీటి లభ్యత ఉంటుంది. ఒక్కసారి ఈ కాల్వలో పట్టిసీమ నీళ్లు ప్రవాహం కొనసాగితే ప్రవాహం అపినప్పుడు రెగ్యులేటర్ లాకులు దించుతారు కాబట్టి ఆరు నెలలపాటు నీటి లభ్యత ఉంటుంది. ఈ నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ పథకాలు రెండు కూడా నిరుపయోగంగా ఉండడంతో రైతులకు ఎటువంటి ప్రయోజనం చేకూరడంలేదు. అదే ఈ రెండు ఎత్తిపోతల పథకాలు వాడుకలో ఉంటే ఈ రెండు చెరువుల కింద ఖరీఫ్‌తో పాటు రబీలో ఆరుతడి పంటలను కూడా సాగు చేసుకోవచ్చని రైతులు చెబుతున్నారు.

నిర్లక్ష్యం నీడలో ఎత్తిపోతల పథకాలు!

నిర్లక్ష్యం నీడలో ఎత్తిపోతల పథకాలు!