
మనసారా.. కొలి‘సారె’
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు మంగళవారం పలు భక్త బృందాలు, ఆలయానికి చెందిన వివిధ విభాగాల సిబ్బంది సారెను సమర్పించారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థాన అన్నదాన విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది సారెను సమర్పించారు. అర్జున వీధిలోని శృంగేరీ మఠం అన్నదాన భవనంలో తొలుత అమ్మవారికి ఆలయ ఈవో శీనానాయక్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జమ్మిదొడ్డి ఆవరణలోని రావిచెట్టు వద్ద దేవతా మూర్తులకు పూజా కార్యక్రమాలను నిర్వహించి.. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాట నృత్యాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారి మూలవిరాట్‌ను దర్శించుకున్న అనంతరం మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి సారెను సమర్పించారు. ఆలయ ఏఈవోలు వెంకటరెడ్డి, చంద్రశేఖర్, ఎన్.రమేష్‌బాబు, కె. గంగాధర్‌లతో పాటు అన్నదాన సిబ్బంది పాల్గొన్నారు.
శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో..
జమ్మిదొడ్డి ఆవరణలోని అమ్మవారి ఉత్సవ మూర్తికి పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ఈవో శీనానాయక్, ఏసీ రంగారావు, ఏఈవోలతో పాటు శానిటేషన్ సిబ్బంది కుటుంబసమేతంగా ఊరేగింపులో పాల్గొని అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. ఆలయ అధికారులు వీరికి సాదరంగా స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 60కి పైగా భక్త బృందాలు అమ్మవారికి సారెను సమర్పించాయి. అర్చకులు ఆశీర్వచనం అందజేసి, ప్రసాదాలను బహూకరించారు.
దుర్గమ్మకు సారె సమర్పించిన
ఆలయ అన్నదానం, శానిటేషన్ సిబ్బంది

మనసారా.. కొలి‘సారె’