
నేటి నుంచి సర్టిఫికెట్ల పరిశీలన
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు):ఏపీ ఈఏపీ (ఇంజనీరింగ్,అగ్రికల్చర్,ఫార్మసీ)(ఎంపీసీ స్ట్రీమ్) సెట్–2025లో ర్యాంకులు పొందిన స్పెషల్ కేటగిరి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన శనివారం నుంచి ప్రారంభం కానుంది. నగరంలోని రమేష్ ఆసుపత్రి రోడ్డులో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ సెంటర్‌లో సర్టిఫికెట్ల పరిశీలనకు అన్ని ఏర్పాటు చేశామని హెల్ప్‌లైన్ సెంటర్ జిల్లా కోఆర్టినేటర్ ఎం.విజయసారధి చెప్పారు.
షెడ్యూల్ ఇదే..
● తొలిరోజు శనివారం ఒకటి నుంచి 60వేలు లోపు ర్యాంకు పొందిన ఎన్‌సీసీ,స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు.
● 13వ తేదీన 60001 నుంచి లక్ష లోపు ర్యాంకు పొందిన ఎన్‌సీసీ, స్పోర్స్ అండ్ గేమ్స్ అభ్యర్థులు, 1నుంచి 50 వేల లోపు ర్యాంకు పొందిన సీఏపీ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు.
● 14వ తేదీన 100001 నుంచి 150000లోపు ర్యాంకు పొందిన ఎన్‌సీసీ, స్పోర్స్ అండ్ గేమ్స్ అభ్యర్థులు, 50001 నుంచి లక్ష లోపు ర్యాంకు పొందిన సీఏపీ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తామని చెప్పారు.
● 15వ తేదీన 150001 నుంచి చివరి ర్యాంకు వరకు ఎన్‌సీసీ,స్పోర్స్ అండ్ గేమ్స్ అభ్యర్థులు, 100001 నుంచి 150000 ర్యాంకు పొందిన సీఏపీ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు.
● 16వ తేదీన సీఏపీ–150001 నుంచి చివరి ర్యాంకు పొందిన సీఏపీ అభ్యర్థులతోపాటు విభిన్న ప్రతిభావంతులు, ఆంగ్లో ఇండియన్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ కేటగిరిలో ఒకటి నుంచి చివరి ర్యాంకు పొందిన వారి సర్టిఫికెట్లను పరిశీలిస్తామని విజయసారథి తెలియజేశారు. హెల్ప్‌లైన్ సెంటర్‌లో స్పెషల్ కేటగిరీకి చెందిన ర్యాంకర్ల సర్టిఫికెట్లను మాత్రమే పరిశీలిస్తామని, జనరల్ కేటగిరీకి చెందిన ర్యాంకర్ల సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో పరిశీలిస్తామని ఆయన వివరించారు.
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
పెనమలూరు: మద్యానికి బానిసగామారి అప్పులు చేసిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెనమలూరులో చోటుచేసుకుంది. పెనమలూరు సీఐ వెంకటరమణ కథనం మేరకు శ్రీకాకుళంకు చెందిన బోద్రోతు సింహాచలం(40), అతని భార్య సుజాత ఉపాఽధి కోసం పెనమలూరు వచ్చి పాత పోలీస్‌స్టేషన్ ప్రాంతంలో ఉంటున్నారు. ఇద్దరు తాపీ పనులు చేస్తారు. అయితే సింహాచలం మద్యానికి బానిసగా మారాడు. మద్యం కోసం అనేకచోట్ల అప్పులు చేశాడు. దీంతో భార్య కొద్దిరోజుల క్రితం శ్రీకాకుళం వెళ్లి పోయింది. కాగా సింహాచలం తాను ఉంటున్న ఇంట్లో చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఇరుగుపొరుగు వారు సింహాచలం మృతిసమాచారాన్ని అతని భార్యకు తెలుపటంతో ఆమె వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి
పెనమలూరు: కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్‌్ కాలేజీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. పెనమలూరు సీఐ వెంకటరమణ కథనం మేరకు..తాడిగడప మిత్రా జ్యువెల్స్‌లో ఉంటున్న విశ్రాంత ఉపాధ్యాయుడు ఎస్.వెంకటరమణ (70) గురువారం రాత్రి మందులు కొనటానికి ఇంటినుంచి బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తూ సిద్ధార్థ ఇంజినీరింగ్‌కాలేజీ వద్ద బందరురోడ్డు దాటుతుండగా విజయవాడ వైపు నుంచి వస్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకటరమణ తలకు బలమైన గాయం కావడంతో అతనిని పోరంకిలో ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. బైక్‌పై ఉన్న భార్యభర్తలకు కూడా గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై మృతుడి కుమారుడు పవన్‌సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.