
ఏఎన్‌ఎం బదిలీలకు కౌన్సెలింగ్
మచిలీపట్నం అర్బన్: ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఏఎన్‌ఎం గ్రేడ్–3 ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్ సోమవారం స్థానిక జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్. శర్మిష్ఠ కౌన్సెలింగ్‌ను పర్యవేక్షించారు. ఉద్యోగులు సేవా రిజిస్టర్, ప్రాధాన్యతలు, విద్యార్హతల జిరాక్స్, పారామెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఒరిజినల్స్‌తో ఉదయం 8గంటల నుంచి కార్యాలయంలో కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. సోమవారం పొద్దుపోయేవరకు సాగిన కౌన్సెలింగ్లో 368 మంది ఎన్టీఆర్, 329మంది కృష్ణా, 94మంది ఏలూరు జిల్లాలోని ఉద్యోగులు బదిలీ అయ్యారు. మునిసిపాలిటీలతో పాటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల పరిధిలో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలకు సీనియారిటీ జాబితాల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి, బదిలీ ఉత్తర్వులను అందజేశారు.