
200 కిలోల గంజాయి పట్టివేత
లబ్బీపేట(విజయవాడతూర్పు): విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి చైన్నెకు అక్రమంగా రవాణా చేస్తున్న 200 కిలోల గంజాయిని విజయవాడ పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ రూ.15 లక్షలు ఉంటుందని అంచనా. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి, ఒకకారు, మినీ గూడ్స్ వ్యాన్‌ను సీజ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ఈ కేసు వివరాలను బుధవారం తన కార్యాలయంలో విలేకరులకు వెల్ల డించారు. సీపీ కథనం మేరకు.. గంజాయి అక్ర మంగా తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని గీతానగర్ కట్ట ప్రాంతంలో ఎస్‌ఐ భానుప్రసాద్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో అటుగా వచ్చిన కారును ఆపి తనిఖీ చేసి గంజాయి బ్యాగులను గుర్తించారు. డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో మినీ గూడ్స్ వ్యాన్ డ్రైవరు పోలీసుల తనిఖీలను గమనించి వాహనం ఆపి, పారిపోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. రెండు వాహనాల నుంచి రూ.15 లక్షల విలువగల 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు విశాఖపట్నం జిల్లా తగరపు వలస, భీమునిపట్నం ప్రాంతాలకు చెందిన అండి నాగరాజు, తమిళనాడులోని ఉత్తమ పలయాన్, కక్కిసింగయన్‌పట్టి గ్రామానికి చెందిన అనబలగన్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. నాగరాజును ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అతను మధురై ప్రాంతానికి వలస వెళ్లి ఆ ప్రాంతంలో గంజాయికి ఎక్కువ డిమాండ్ ఉండటంతో విశాఖ ఏజెన్నీ ప్రాంతాల నుంచి తక్కువ రేటుకు కొనుగోలుచేసి, చైన్నెలో ఎక్కువ ధరకు విక్రయించేందుకు అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నాగరాజు తనకు తెలిసిన అనబలగన్‌కు విషయం చెప్పి, అతని గూడ్స్ వాహనాన్ని ప్రత్యేక అరలుతో తయారు చేయించి గంజాయి తరలిస్తున్నారు. ఇలా రెండుసార్లు పట్టుబడి జైలుకు కూడా వెళ్లివచ్చారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కారు ముందు, వెనుక గూడ్స్ వాహనం వెళ్తుండగా రెండింటినీ పోలీసులు పట్టుకున్నారు. ఒక్కొక్క వాహనం నుంచి 100 కిలోల చొప్పున 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీపీ రాజశేఖరబాబు తెలిపారు. ఈ సమావేశంలో సౌత్ ఏసీపీ డి.పావన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇద్దరు నిందితుల అరెస్టు
కారు, మినీ గూడ్స్ వ్యాన్ సీజ్