
రూ. 83,500 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాలను విజయవంతం చేయడంలో బ్యాంకర్ల పాత్ర కీలకమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన రూ. 83,500 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక (ఏసీపీ) లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకునేందుకు బ్యాంకులు కృషి చేయాలన్నారు. మంగళవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో లీడ్ జిల్లా కార్యాలయం ఆధ్వర్యాన జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ), జిల్లాస్థాయి సమీక్ష కమిటీ (డీఎల్‌ఆర్‌సీ) సమావేశాలు జరిగాయి. సమావేశంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి 2025–26 వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. ఎల్‌డీఎం.. గత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనలో వివిధ బ్యాంకుల పాత్ర, బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన కీలక సూచికల్లో ప్రగతి, ప్రభుత్వ పథకాలకు సంబంధించి బ్యాంక్ లింకేజీ రుణాలు, ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు తదితరాలను పీపీటీ ద్వారా వివరించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ 2025–26 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రంగానికి రూ. 13,500 కోట్లు, ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ. 17వేల కోట్లు రుణ లక్ష్యాలను ప్రతిపాదించినట్లు తెలిపారు. మొత్తం ప్రాధాన్యరంగానికి రూ. 33 వేల కోట్లు, ప్రాధాన్యేతర రంగానికి రూ. 50,500 కోట్ల మేర లక్ష్యాలను రుణ ప్రణాళికలో పొందుపరిచినట్లు వివరించారు. ఇతర ప్రాధాన్య రంగానికి రూ. 2,495 కోట్ల రుణాలను ప్రతిపాదించినట్లు తెలిపారు.
బ్యాంకుల భాగస్వామ్యం ముఖ్యం
కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ వికసిత్ భారత్ – 2047, స్వర్ణాంధ్ర : 2047 లక్ష్యాలు నెరవేరాలంటే బ్యాంకుల భాగస్వామ్యం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. సమావేశంలో డీసీసీ కన్వీనర్, యూబీఐ రీజనల్ హెడ్ ఎంవీ తిలక్, ఆర్‌బీఐ ఎల్‌డీవో సీహెచ్ నవీన్ కుమార్, నాబార్డు డీడీఎం మిలింద్ చౌసాల్కర్, ఎల్‌డీఎం కె.ప్రియాంక, ఆర్‌సేతి డైరెక్టర్ అమరేశ్వర్, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.
రుణ ప్రణాళిక ఆవిష్కరించిన
జిల్లా ఇన్‌చార్జి మంత్రి సత్యకుమార్