
ఉపాధ్యాయుల నిరసన
సర్దుబాటు ప్రక్రియపై
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పాఠశాల విద్యాశాఖ చేపడుతున్న పాఠశాల పునఃవ్యవస్థీకరణ ప్రక్రియతోపాటు స్పష్టమైన జీఓలు లేకుండా రోజుకో ఆలోచనతో జరుగుతున్న ఉపాధ్యాయుల సర్దుబాటుపై యూటీఎఫ్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. 117 జీఓను రద్దు చేసిన నూతన జీఓ జారీ చేసిన తర్వాత మాత్రమే పాఠశాలను పునఃవ్యవస్థీకరించాలని డిమాండ్ చేశారు. విజయవాడ అలంకార్ సెంటర్ లోని ధర్నా చౌక్‌లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, ఆలవాల సుందరయ్య మాట్లాడుతూ.. అన్ని ప్రాథమిక పాఠశాలల్లో 1ః20 నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులను నియమించాలని, అన్ని మోడల్ ప్రైమరీ స్కూల్స్‌లో ఐదు తరగతులు బోధించడానికి ఐదుగురు టీచర్లను నియమించాలని, విద్యార్థుల సంఖ్య 76కు మించితే పీఎస్, హెచ్‌ఎం పోస్టులు అద నంగా కేటాయించాలని, 120 మించితే ఆరో ఎస్జీటీ, ఆ పైన ప్రతి 30 మందికి ఒక ఎస్జీటీ చొప్పున కేటాయించాలని డిమాండ్ చేశారు. వేసవి సెలవుల్లోనే బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. నిరసన కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు, పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.