వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): దేశ వ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)– 2025 ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 13,625మంది విద్యార్థులను కేటాయించగా అందులో 13,455 మంది హాజరయ్యారు. 98.75 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్న ఈ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షను జిల్లాలో 28 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పరీక్ష కొనసాగింది. విద్యార్థులను 11.00 గంటల నుంచి పరీక్ష జరిగే ప్రాంగణాల్లోకి అనుమతించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు కేంద్రాల ప్రధాన ద్వారాలను మూసివేశారు. అభ్యర్థుల హాల్‌టికెట్‌తో పాటుగా ఇతర గుర్తింపు కార్డుల ఉంటేనే లోపలకు అనుమతించారు. పొడవాటి దుస్తులు, బూట్లు, నగలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశీలించి అభ్యర్థులను లోపలకు అనుమతించారు. అనంతరం విద్యార్థులు బయోమెట్రిక్ పరిశీలన చేసి ఆ తదుపరి పరీక్ష గదిలోకి అనుమతించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఆయా పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాలన్నీ సందడిగా మారాయి. వారి వాహనాలతో పరిసర ప్రాంతాలన్నీ నిండిపోయాయి. మధ్యాహ్నం 1.30 గంటల వరకూ విద్యార్థుల తల్లిదండ్రులు గేట్ల వద్దనే నిలిచి ఉన్నారు. స్థానిక పోలీసు అధికారులు బందోబస్తు నిర్వహించటంతో పాటుగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూశారు.
ఆలస్యంగా పేపరు..
మార్కాపురానికి చెందిన బి. మేఘన కిరణ్మయి అనే విద్యార్థికి సత్యనారాయణపురంలోని కేంద్రీయ విద్యాలయం పరీక్ష కేంద్రంగా కేటాయించారు. ఆమెకు బయోమెట్రిక్ హాజరుకు సంబంధించి సమస్య తలెత్తటంతో టాలీ కాలేదని, 2.00 గంటల తర్వాత టాలీ కావటంతో 2.13 నిమిషాలకు తనను పరీక్ష గదిలోకి అనుమతించినట్లు ఆమె పేర్కొంది. సుమారు 20 నిమిషాలు ఆలస్యంగా పేపర్ ఇచ్చారని, ఆ మేర అదనపు సమయం ఇవ్వకుండా పేపర్ తీసేసుకున్నారని ఆమె తన తండ్రి శ్రీనివాసగణేష్‌తో కలిసి ‘సాక్షి’కి వివరించింది. ఎంతో కష్టపడి చదివిన తన కుమార్తెకు తీవ్ర అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలంటూ తండ్రి పేర్కొన్నారు. దీనిపై జిల్లా కోఆర్డినేటర్ ఆదిశేషశర్మను వివరణ కోరగా అటువంటిదేమి లేదని, ఆమె అబద్ధం చెబుతున్నట్లు పేర్కొన్నారు.
గాలివానతో అవస్థలు..
పరీక్షకు బయలుదేరిన విద్యార్థులు గాలివానతో తీవ్ర అవస్థలకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురవటంతో బస్సులు రాకపోకలకు సైతం ఇబ్బందులు తలెత్తాయి. తల్లిదండ్రులతో ద్విచక్ర వాహనాల్లో బయలుదేరిన విద్యార్థులు వర్షానికి తడిసిమముద్ధయ్యారు. అలాగే పదకొండు గంటల వరకూ పలు ప్రాంతాల్లో వర్షపునీరు నిలిచి ఉండటంతో ఆటోలు, ఇతర సర్వీసులు అందుబాటులోకి రాలేదు. దాంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు.
జిల్లాలో 13,625 మందికిగాను 13,455 మంది హాజరు బయోమెట్రిక్ సమస్యతో ఒక విద్యార్థినికి ఆలస్యంగా పేపర్ జారీ అదనపు సమయం ఇవ్వలేదని ఆ విద్యార్థిని ఆరోపణ పరీక్ష నిర్వహణ తీరును పర్యవేక్షించిన కలెక్టర్ లక్ష్మీశ
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా వ్యాప్తంగా మూడు కేంద్రాల్లో నీట్ పరీక్ష జరిగింది. మచిలీ పట్నంలోని కేంద్రీయ విద్యాలయం, కృష్ణా విశ్వవిద్యాలయం కళాశాలతో పాటు గన్నవరంలోని వీఎస్‌ఎస్‌టీ జాన్స్ హైస్కూల్‌లో పరీక్ష నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ఇన్విజిలేటర్ల నియామకంతో పాటు నోడల్ అధికారులు, సహాయ నోడల్ అధికారులను నియమించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూశారు. పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 1096 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 1073 మంది విద్యార్థులు హాజరయ్యారు. 23 మంది విద్యార్థులు హాజరుకాలేదు. ఎస్పీ ఆర్ గంగాధరరావు కేంద్రీయ విద్యాలయం, కృష్ణా యూనివర్సిటీలోని కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను పరిశీలించి విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడారు.
కృష్నా జిల్లాలో 1,073 మంది హాజరు
నీట్‌గా.. ప్రశాంతంగా..
నీట్‌గా.. ప్రశాంతంగా..