
పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరపాలక సంస్థ ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు సాధించింది. నిత్యం 550 మెట్రిక్ టన్నుల చెత్త, వ్యర్థాలను ప్రాసెస్ చేసి తడి చెత్త నుంచి బయోమెథడైజేషన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నందుకు ఈ గౌరవం లభించింది. ఈ మేరకు ఫలితాలను ఈ నెల 10వ తేదీన విడుదల చేయగా శనివారం ఢిల్లీలో అవార్డు ప్రదానం జరిగింది. మేయర్ రాయన భాగ్య లక్ష్మి, వీఎంసీ అదనపు కమిషనర్(ప్రాజక్ట్స్) కె.వి సత్యవతి స్కాచ్ చైర్మన్ కొచ్చర్ సిల్వర్ నుంచి అవార్డును అందుకున్నారు. మురుగు నీటి శుద్ధికి ప్రతి నెల 2.1 లక్షల వాట్స్ విద్యుత్ ఖర్చవుతుండగా ఆ విద్యుత్‌నంతా బయోమెథడైజేష్ ప్లాంట్ నుంచి సరఫరా చేస్తున్నందుకు ఈ అవార్డు దక్కింది. జనవరి నుంచి జరిగిన ఎన్నిక ప్రక్రియలో నగరవాసులు కూడా ఓటింగ్‌తో పాల్గొన్నారని, ఇది నగరానికి శుభ పరిణామమని వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఏర్పాట్ల పరిశీలన
భవానీపురం(విజయవాడపశ్చిమ): నగరంలోని డాక్టర్ వైఎస్సార్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఈ నెల 27వ తేదీన కేంద్ర బృందం సందర్శించనున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లను ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్ శనివారం పరిశీలించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ నమోదు సంఖ్యల పని తీరు, వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారానికి సంబంధించిన బోర్డ్‌ల ప్రదర్శన తదితర అంశాలపై అధికారు లతో సమీక్షించారు. రాష్ట్ర అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నోడల్ అధికారి డాక్టర్ విజ యలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధి కారి డాక్టర్ ఎం.సుహాసిని, అర్బన్ సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ నరసింహ నాయక్, డీపీఎంఓ డాక్టర్ పామర్తి నవీన్ పాల్గొన్నారు.
తెలుగు ఉత్తమ భాష
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ప్రపంచంలోనే ఉత్తమ భాష తెలుగు అని, తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు పి.వి.విజయ్‌బాబు అన్నారు. ఏ శబ్దాన్ని అయినా పలకడం, రాయగలగడం ఒక్క తెలుగులోనే సాధ్యమని పేర్కొన్నారు. కేఎల్‌రావునగర్‌లోని రాకేష్ పబ్లిక్ స్కూల్‌లో శని వారం తెలుగు పద్య తోరణం పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విజయ్‌బాబు, సాహితీపీఠం చైర్మన్ టి. శోభనాద్రి, ఆర్‌కే ఇండస్ట్రీస్ అధినేత రామకృష్ణారెడ్డి, తెలుగు భాషా కోవిధుడు వి.వి.సుబ్బారావు, ప్రముఖ కవి గుమ్మా సాంబశివరావు, న్యాయవాది పిళ్లా రవి విచ్చేశారు. స్కూల్ డైరెక్టర్ ఎస్.వి.రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత సరస్వతీదేవి చిత్రపటానికి పూజలు చేశారు. అనంతరం పలువురు విద్యార్థులు భాస్కర శతకం, కుమార శతకం, తెలుగు బాల శతకం, సుమతి శతకం, వేమన శతకం నుంచి పలు పద్యాలను ఆలపించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తెలుగు ఉపాధ్యాయులు కె.వాసుదేవరావు, జి.ఉదయలక్ష్మిని అతిథులు అభినందించారు.
