
మాట్లాడుతున్న డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి
మధురానగర్(విజయవాడసెంట్రల్): లోక కల్యాణం కోసం ఆంధ్రా షిరిడీ ముత్యాలంపాడు షిరిడీ సాయిబాబా మందిరంలో ఈ నెల 28న తలపెట్టిన కోటి రుద్రాక్ష అభిషేకానికి సర్వం సిద్ధం చేశామని మందిర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి తెలిపారు. మందిరంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 28వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు షిరిడీ పూజారులతో బాబావారికి కాకడ హారతితో కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని చెప్పారు. 4 గంటలకు భక్తులచే
అభిషేకం, 4.15 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, మహన్యాస పారాయణ, రుద్రాక్ష అభిషేకం చేస్తారని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రుద్రహోమం, గణపతి, లక్ష్మీగణపతి, నవగ్రహ హోమం నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చండీ హోమం, ఉదయం 10 గంటలకు విశాఖ శ్రీశారదాపీఠ స్వామీజీచే రుద్రాక్షల
అభిషేకం చేస్తారని తెలిపారు. ఉదయం 11 గంటలకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిచే అవార్డు ప్రదానం ఉంటుందన్నారు. స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ, అష్టాక్షరీ స్వామీజీ, 11 గంటలకు వాసుదేవానందగిరి స్వామీజీ, 12 గంటలకు నంబూరు మాతాజీ, మధ్యాహ్నం 2 గంటలకు తుళ్ళూరు స్వామీజీ, 3 గంటలకు 30 మంది వేద విద్యార్థులు, సాయంత్రం 6.30 గంటలకు షిరిడీ పూజారులచే శేజ్‌హారతి జరుగుతుందన్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశామన్నారు. 29వ తేదీ బుధవారం 30వ తేదీ గురువారం రుద్రాక్షలతో నిండి ఉన్న బాబావారి దర్శనం కల్పిస్తామని వెల్లడించారు. 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు లక్ష మంది భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులు, మంత్రులు, స్వామీజీలు పాల్గొంటారని తెలిపారు. భక్తులు పాల్గొని బాబావారి కృపకు పాత్రులు కావాలని కోరారు. మందిర కోశాధికారి సత్యశ్రీహరి, వై.శ్రీనివాసరావు తదితరులున్నారు.