
విజయవాడ కల్చరల్: మహానటి సావిత్రి జీవితం కళకే అంకితమని ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బులుసు శివశంకరరావు అన్నారు. మహానటి సావిత్రి కళాపీఠం ఆధ్వర్యంలో తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో మహానటి జీవిత సాఫల్య పురస్కార ప్రదాన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. పురస్కారం అందుకున్న శివశంకరావు మాట్లాడుతూ సావిత్రిలాంటి నటీమణులు తెలుగు సినీ జీవితంలో అరుదుగా కనిపిస్తారని చెప్పారు. ఆమె పేరుతో పురస్కారం అందుకోవడం అదృష్టంగా భావిస్తునట్లు తెలిపారు. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రభుత్వం కళాకారుల సంక్షేమం కోసం కృషి చేస్తునట్లు తెలిపారు. మహానటి సావిత్రి పేరుతో సంస్థను స్థాపించి 13 సంవత్సరాలుగా కళాపీఠం అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. కళాపీఠం వ్యవస్థాపకురాలు పరుచూరి విజయలక్ష్మి సంస్థ లక్ష్యాలను వివరించారు. శాతవాహన కళాశాల కరస్పాండెంట్ నిడుమోలు రమా సత్యనారాయణ జస్టిస్ శివశంకర్ సేవలను వివరించారు. ప్రముఖ న్యాయవాది వేముల హజరత్తయ్య గుప్తా, బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు కొప్పరపు బలరామకృష్ణ మూర్తి ప్రసంగించారు. వివిధ సంస్థల ప్రతినిధులు బులుసు శివశంకర్ దంపతులను సత్కరించారు. కళాపీఠం నిర్వాహకులు వివిధ రంగాల్లోని ప్రముఖులకు ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు. కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
విశ్రాంత న్యాయమూర్తి
బులుసు శివశంకరరావు