
మంత్రి ఆర్కే రోజా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. శుక్రవారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ మహిళ జట్టు మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఒడిశాలో ఈ నెల 19 నుంచి 23 వరకు జరిగిన 19వ జాతీయస్థాయి సీనియర్ సాఫ్ట్ టెన్నిస్ చాంపియన్ షిప్‌లో ఏపీ జట్టు కాంస్య పతకం సాధించి గోవాలో జరగనున్న నేషనల్ గేమ్స్‌కు అర్హత సాధించడం శుభపరిణామం అన్నారు.
26న రాఘవేంద్రరావుకు జీవిత సాఫల్య పురస్కారం
విజయవాడ కల్చరల్: రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో సినీ దర్శకుడు కె. రాఘవేంద్రరావుకు జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు కాజ నాగరాజు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన సినీ రంగానికి చేసిన సేవలను గుర్తించి 2023 సంవత్సరానికి ఈ అవార్డును అందిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 26వ తేదీ ఆదివారం సాయంత్రం వేదిక హాల్‌లో పురస్కార ప్రదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. పురస్కార సభలో రోటేరియన్ వి భాస్కరరామ్, పులిపాక కృష్ణాజీతో పాటు రోటరీక్లబ్ విజయవాడ శాఖ సభ్యులు పాల్గొంటారని తెలిపారు.
రేపు రాష్ట్ర స్థాయి
టెన్నిస్ టోర్నీ
విజయవాడ స్పోర్ట్స్: అండర్–12, 14, 16 బాలబాలికల ఏపీ స్టేట్ ఓపెన్ టెన్నిస్ ప్రైజ్‌మనీ టోర్నమెంట్‌ను విజయవాడ శివారు నిడమానూరులోని స్టార్ టెన్నిస్ అకాడమీలో ఈ నెల 26వ తేదీన నిర్వహిస్తున్నట్లు అకాడమీ డైరక్టర్ కె.గోపాల్ తెలిపారు. స్టార్ టెన్నిస్ అకాడమీ, గ్లోబల్ స్పోర్ట్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈ నెల 25వ తేదీ లోపు 8143783999, 9553335357ను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పోటీల్లో విజేతలకు నగదు బహుమతి అందజేస్తామన్నారు.
కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తులు
మధురానగర్(విజయవాడసెంట్రల్): కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల చేసినట్లు సత్యనారాయణపురం కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ ఎంవీ రావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 31వ తేదీ నాటికి ఆరు ఏళ్లు నిండిన వారు ప్రవేశాలకు అర్హులుగా నియమావళిలో పేర్కొన్నారన్నారు. ఈనెల 27వ తేదీ నుంచి అర్హులైన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ వచ్చే నెల 17వ తేదీగా నిర్ణయించామన్నారు. దరఖాస్తులను పరిశీలించి ఏప్రిల్ 20వ తేదీన మొదటి జాబితాను విడుదల చేస్తామన్నారు. ఎంపికై న వారికి వచ్చేనెల 21వ తేదీ నుంచి అడ్మిషన్‌లు ఇస్తామన్నారు.