
అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న డాక్టర్ రామిరెడ్డి తదితరులు
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్ రామిరెడ్డి
భవానీపురం(విజయవాడపశ్చిమ): యాంటీ లార్వా ఆపరేషన్ పనులకు సంబంధించి కచ్చా డ్రెయిన్స్, కాలువలు, మురికి గుంతలు అలాగే నీరు నిల్వ ఉండే ప్రదేశాలలో దోమల లార్వా నిర్మూలనకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్ రామిరెడ్డి తెలిపారు. ఫ్రైడే డ్రై డే సందర్భంగా శుక్రవారం విజయవాడ రూరల్ గొల్లపూడి గ్రామంలోని సాయిపురం కాలనీలో ఫ్రైడే డ్రై డే అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాలనీలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి దోమలు ఉత్పత్తి అయ్యే ప్రదేశాలను శుభ్రం చేశారు. అదే విధంగా శానిటరీ సిబ్బందిని ఇంటింటికీ పంపించి లోపల నీరు నిల్వ ఉండే ప్రదేశాలు, పరిసరాలను తనిఖీ చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామిరెడ్డి మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ప్రజలు విధిగా డ్రై డే గా పాటించాలని, లేని పక్షంలో నీటి డ్రమ్ముల్లో నిల్వ ఉంచే నీరు, ఇంటి ఆవరణలో ఉండే పనికిరాని వస్తువుల్లో వర్షపు నీరు చేరి దోమలు ఉత్పత్తి చెందుతాయని తెలిపారు. తద్వారా వ్యాప్తి చెందే మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని తెలిపారు. వాటి నుంచి కాపాడుకోవాలంటే పరిసరాల పరిశుభ్రతను పాటించాలని, దోమల నివారణ చర్యలకు సహకరించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మోతిబాబు, కొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఆర్. పద్మావతి, ఏఎంఓ సూర్యకుమార్, మలేరియా సబ్ యూనిట్ అధికారి బీజీ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.