తెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్, మే డే సందర్భంగా Terusan Recreation Centre వద్ద ఘనంగా ముగిసింది. ఏప్రిల్ 18 నుంచి మే 1 వరకు నాలుగు వారాంతాల్లో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో, సింగపూర్ నలుమూలల నుంచి వచ్చిన తెలుగు కార్మికులు, ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యులు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు .“సైట్‌లో కష్టం… గ్రౌండ్‌లో శక్తి” అనే నినాదంతో నిర్వహించిన ఈ టోర్నమెంట్, సింగపూర్ తెలుగు సమాజ ఐక్యత, శక్తి కృషికి ప్రతీకగా నిలిచింది.
మొత్తం 18 జట్లు పోటీపడిన ఈ టోర్నమెంట్‌లో, లీలా నాగేశ్ నాయకత్వంలోని తెలుగు వారియర్స్ జట్టు విజేతగా నిలవగా, సాహు చంద్రశేఖర్ నాయకత్వంలోని మెగాయార్డ్ రైడర్స్ జట్టు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 17 మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగగా, 250కి పైగా ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలకు వరుసగా SGD1,116 మరియు SGD558 నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు అందజేశారు.

వ్యక్తిగత విభాగంలో బండి శ్రీనివాస్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకోగా, శ్యామ్ ఉత్తమ ఆల్‌రౌండర్‌గా, ఆంథోనీ ఉత్తమ బౌలర్‌గా, విజ్జు ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా ఎంపికయ్యారు. మెగాయార్డ్ రైడర్స్ జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు వ్యక్తిగత అవార్డులు గెలుచుకోవడం విశేషం.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సారిక ప్రసాద్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే రాంబాబు పాతూరి (కాకతీయ కల్చరల్ అసోసియేషన్), రత్న కుమార్ కవుటూరు (శ్రీ సాంస్కృతిక కళాసారథి), సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్ష్యులు రంగా రవి, చౌదరి జె తదితరులతో పాటు శేషారావు గూడూరి, వినయ్ కుమార్ సూర్యదేవర, సురేంద్ర చెబ్రోలు, చంద్రశేఖర్ చిలుకూరి, హనుమంతరావు మాదాల, అమ్మయ్య చౌదరి, గంగాధర్ తాటి, సతీష్ పారేపల్లి, వేణు నార్నే తదితర ప్రముఖులు విచ్చేసి నిర్వాహకులను మరియు క్రీడాకారులను అభినందించారు.

శివ ప్రసాద్ కొల్లా నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బి వర ప్రసాద్, గిరిధర్ సరాయి, అనిల్ కుమార్ బొమ్మారెడ్డి తదితరులతో పాటు కోఆర్డినేటర్లు, లాజిస్టిక్స్ టీమ్, అంపైర్లు, స్కోరర్లు, వాలంటీర్లు అహర్నిశలు శ్రమించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సురేంద్ర చేబ్రోలు, ఉమా మహేశ్వర రావు, గురురాజ్ బనకర్, శ్రీను యాదవ్, గొర్రెపాటి లక్ష్మీ రెడ్డి అంపైర్లుగా వ్యవహరించగా, రమేష్ వ్యాఖ్యాతగా కార్యక్రమానికి మరింత ఆకర్షణ తీసుకువచ్చారు.
టీం శివప్రసాద్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఈ టోర్నమెంట్ విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, వచ్చే ఏడాది టీంను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మహిళల విభాగం ప్రవేశపెట్టడం, మెరుగైన లైవ్ స్ట్రీమింగ్, మరిన్ని సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.


