ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ వార్షికోత్సవాలు | Swaralaya Arts Singapore Fine Arts Academy Celebrates 7th Annual Day | Sakshi
Sakshi News home page

ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ వార్షికోత్సవాలు

May 5 2026 2:43 PM | Updated on May 5 2026 3:19 PM

Swaralaya Arts Singapore Fine Arts Academy Celebrates 7th Annual Day

స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ తన సప్తమ వార్షికోత్సవం (ఏప్రిల్25, 2026) ఘనంగా జరుపుకుంది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ కార్యక్రమం ప్రొఫెసర్ బి.వి.ఎస్. చౌదరి, రాజ్యలక్ష్మి చౌదరి సమక్షంలో  సింగపూర్ శివకృష్ణ దేవాలయంవారి ఫంక్షన్ హాలు వేదికగా జరిగింది.

స్వరలయ సంస్థ విద్యార్ధుల సంగీత మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ఆహూతులను అలరించారు. కుమారి శ్రీవిద్య పంతువరాళి రాగంలో “ఎన్నగాను రామభజన” త్యాగరాజ కీర్తనను హృద్యంగా గానం చేశారు. స్వరలయ వ్యవస్థాపక అధ్యక్షురాలు, గురు శేషుకుమారి సంగీత ప్రదర్శనలో ఆలపించిన త్యాగరాజ కీర్తన “ప్రక్కల నిలబడి”, ఒక “మీరా భజన్” , విద్యార్థులతో కలిసి చేసిన జానపద గీతం ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలు అందుకున్నాయి.

తరువాత తెలుగు విశ్వవిద్యాలయం గ్రేడ్ , యూనివర్సిటీ కోర్సులలో ఉత్తీర్ణులైన సంగీత విద్యార్ధులకు VC నిత్యానందరావు అర్హతాపత్రాలు, ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేషుకుమారి సంగీత ప్రస్థానాన్ని ప్రశంసించారు. సంగీతకళను భావితరాలకి అందించేలా ఆమెను నడిపిస్తున్నాయన్నారు. స్వరలయ విద్యార్ధులు భవిష్యత్తులో కర్నాటక సంగీతరంగంలో తమవైన విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

హార్మనీ & హ్యూస్ అధ్యక్షురాలు శ్యామల ప్రసంగిస్తూ 2025లో తిరుపతిలో అన్నమాచార్య 500వ జయంతి ఉత్సవాలలో చేసిన సంగీత కచేరీ, శేషుకుమారి వంశీ-సీల్వెల్ ఫౌండేషన్ వారి మంగళంపల్లి బాలమురళీకృష్ణ అవార్డ్ అందుకోవడం స్వరలయసంస్థ సాధించిన కొత్త మైలురాళ్ళని కొనియాడారు.

అలాగే కుమారి మనోజ్ఞ అనే గాత్రసంగీత విద్యార్ధి మాట్లాడుతూ కర్నాటక గాత్ర సంగీతాన్ని ఒక O-level ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకుని పరీక్షలు వ్రాసేందుకు MOE (సింగపూర్ విద్యాశాఖ) తాను అనుమతి సాధించగలగటం విశేషం అనీ, ఇది తన గురువు ఇచ్చిన స్ఫూర్తి, మార్గదర్శకత్వం వల్లనే సాధ్యమైందనీ, సంగీతం ఒక సబ్జెక్టుగా తీసుకోవడంతో ఇటు సంగీతంలో కృషి, అటు చదువుకునే సమయాన్ని సమర్ధవంతంగా వాడుకోవడం వీలవుతోందని చెప్పారు. ఈ వేడుకలో మరో ప్రత్యేక ఆకర్షణగా, గురు శేషుకుమారి తాళం మరియు రాగం నేర్పించేందుకు వినూత్నమైన సంగీత ఆటలను ప్రవేశపెట్టారు. ఇవి ప్రత్యక్షంగా వేదికపై నిర్వహించబడి, సంగీత శిక్షణలో ఒక కొత్త పోకడను పరిచయం చేశాయి.

యూ.టీ.ఐ.ఏ.ఈ.సీ చైర్మన్ రాయ్, ట్రెజరర్ v. Adesh బాబు , కళ , శివ కృష్ణ ఆలయ చైర్మన్ ,మేనేజర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీసాంస్కృతిక కళాసారధి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, కాకతీయ సాంస్కృతిక పరివారం నుంచి సబ్బుపాలకుర్తి , సింగపూర్ తెలుగు వనితలు సమూహం నుంచి  క్రాంతి, జయ, దీపు , రేఖ , రాణి, గాయత్రి వంటి అతిథుల సమక్షంలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. పిల్లల ఉత్సాహభరితమైన ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించి, వేడుకను విజయవంతంగా ముగించాయి. సౌజన్య చక్కటి వ్యాఖ్యానంతో  కార్యక్రమాన్ని రక్తి కట్టించారు

Advertisement
 
Advertisement
Advertisement