తాత పుట్టింది మహబూబ్‌నగర్‌.. మనవడు అడుగు పెట్టేది చంద్ర మండలం

NASA ACE Astronaut Raja Chari Connection With Hyderabad - Sakshi

జాబిల్లిపై పరిశోధనలు విస్తృతం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రాయాన్‌ ప్రయోగాల్లో బిజీగా ఉండగానే భారత మూలాలు ఉన్న మరో వ్యక్తి ఏకంగా జాబిల్లిపై అడుగు పెట్టేందుకు ఆకాశంలోకి అడుగు పెట్టాడు. 

Raja Chari-Led SpaceX Crew-3 Mission Lifts Off: నాసా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థలు ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లోకి పంపించేందుకు ప్రయోగించిన స్పేస్‌ఫ్లైట్‌ స్పేస్‌ఎక్స్‌ క్రూ 3లో ఇండో అమెరికన్‌ రాజాచారి అంతరిక్షంలోకి అడుగు పెట్టారు. రాచాచారితో పాటు మిషన్‌ స్పెషలిస్ట్‌ కేయ్‌లా బారోన్‌, వెటరన్‌ అస్ట్రోనాట్‌ టామ్‌ మార్ష్‌బర్న్‌లు అంతరిక్ష యానానికి బయల్దేరి వెళ్లారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కెన్నెడీ స్పేస్‌ స్టేషన్‌ నుంచి నిప్పులు కక్కుకుంటూ వీరిని ఫాల్కన్‌ రాకెట్‌ నింగిలోకి మోసుకెళ్లింది. 

మూలాలు మహబూబ్‌నగర్‌లో
అంతరిక్షంలో అడుగు పెడుతున్న రాజాచారి తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి. ఆయన తండ్రి శ్రీనివాసాచారి ఉస్మానియా యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి అమెరికాలో సెటిల్‌ అయ్యారు. శ్రీనివాసాచారి తండ్రి స్వస్థలం మహబూబ్‌నగర్‌ జిల్లా. అక్కడి నుంచి గణితం బోధించే అధ్యాపకుడిగా పని చేసేందుకు హైదరాబాద్‌ వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. 

హైదరాబాద్‌ టూ అమెరికా
ఉస్మానియా యూనివవర్సిలో ఇంజనీరింగ్‌ పూర్తి చేసి పై చదువుల కోసం అమెరికా వెళ్లారు శ్రీనివాసాచారి. అక్కడ ఉద్యోగం చేస్తూ అమెరికన్‌ మహిళ పెగ్గీ ఎగ్‌బర్ట్‌ని వివాహం చేసుకున్నారు. వీరికి 1977 జూన్‌ 24న రాజాచారి జన్మించారు. రాజాచారి పూర్తి పేరు రాజా జాన్‌ వీర్‌పుత్తూర్‌ చారి.

అస్ట్రోనాట్‌
చిన్నప్పటి నుంచే అస్ట్రోనాట్‌ కావాలనే లక్ష్యం పెట్టుకున్నారు చారి. అందుకు తగ్గట్టే చదువులోనే కాదు ఆటపాటల్లోనూ ఆస్ట్రోనాట్ కల ప్రతిబింబిచేలా ప్రవర్తించేవారు. అందుకు తగ్గట్టే 1995లో యూఎస్‌ స్టేట్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో చేరారు. ఆ తర్వాత 1999లో ఆస్ట్రోనాటికల్‌ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఇదే విభాగంలో 2011లో మాస్టర్స్‌ పూర్తి చేశారు.

నాసాలోకి ఎంట్రీ
అంతరిక్ష పరిశోధనల కోసం నాసా 2017లో ఎంపిక చేసిన అస్ట్రోనాట్‌ గ్రూప్‌ 22కి ఎంపికయ్యారు రాజా చారి. రెండేళ్ల శిక్షణ అనంతరం 2024లో నాసా చంద్రుడి మీద ప్రయోగాల కోసం చేపట్టనున్న ఆర్టెమిస్‌ టీమ్‌కి సైతం ఎంపికయ్యారు. ఆ ప్రాజెక్టు సన్నహకాల్లో భాగంగా కమాండ్‌ ఇన్‌ ఛీఫ్‌ హోదాలో స్పేస్‌ ఎక్స్‌ క్రూ 3లో ఇంటర్నేషనల్‌ స్పేస్‌ సెంటర్‌కి వెళ్లారు. 

ట్యాంక్‌బండ్‌ జ్ఞాపకాలు మరిచిపోలేను
‘నా తండ్రి మూలాలు భారత్‌లో ఉన్నాయనే విషయం నేను మరిచపోలేదు. ఇప్పటి వరకు మూడు సార్లు హైదరాబాద్‌కి వచ్చాను. అక్కడ మా బంధువులు చాలా మంది ఉన్నారు. చిన్నతనంలో వేసవి సెలవులకు హైదరాబాద్‌ వచ్చినప్పుడు ట్యాంక్‌బండ్‌కి వెళ్లాం. చాలా ఎంజాయ్‌ చేశాం. సంతోషంగా గడిపిన ఆ రోజులను నేను ఎన్నడూ మరిచిపోను’ అంటూ భాగ్యనగరంతో తనకున్న అనుభవాలను ఇటీవల నెమరువేసుకున్నారు రాజాచారి. అంతేకాదు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఇక్కడి ఫుడ్‌ బాగా ఎంజాయ్‌ చేశానని, కొన్ని తెలుగు పదాలు కూడా నేర్చుకున్నట్టు ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ తెలుగు పదాలు అంతగా గుర్తులేవన్నారు. 

త్వరలో జాబిల్లిపైకి
రాజాచారి ప్రస్తుతం హుస్టన్‌ నగరంలో నివసిస్తున్నారు. ఆయనకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. అంతరిక్ష స్పేస్‌ స్టేషన్‌లో ప్రయోగాలు ముగించుకుని వచ్చిన తర్వాత ఆయన చంద్రమండల యాత్రకు సన్నద్ధం అవుతారు. 

చదవండి: చల్లని ‘రాజా’ ఓ చందమామ

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top