● ప్రత్యామ్నాయ మార్గం లేక
రైతులపైనే సేకరణ భారం
● పండించిన పంటలో కొంత విత్తనానికి దాచుకుంటున్న రైతులు
మోర్తాడ్(బాల్కొండ): వాణిజ్య పంటల సాగులో ముందంజలో ఉన్న ఈ ప్రాంత రైతులకు పసుపు విత్తనం కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆహార ధాన్యాలు, పసుపు మినహా ఇతర వాణిజ్య పంటల సాగుకు అవసరమైన విత్తనాలు మార్కెట్‌లో లభిస్తున్నా పసుపు విత్తనం మాత్రం రైతులే సొంతంగా సమకూర్చుకోవాల్సి వస్తోంది. తాము పండించిన పంటలోనే కొంత భాగాన్ని విత్తనంగా వినియోగిస్తున్నారు. ఫలితంగా ఆదాయం తగ్గిపోయి పసుపు విత్తనం ధర భారంగా మారిందని రైతులు వాపోతున్నారు. ఒక ఎకరానికి నాలుగు క్వింటాళ్ల పసుపు విత్తనం వినియోగించాల్సి వస్తుంది. మార్కెట్‌లో ఉన్న ధర ప్రకారం పసుపు విత్తనం ఒక ఎకరానికి రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. జాతీయ పసుపు బోర్డు మన జిల్లాలోనే ఏర్పాటు కాగా పసుపు పరిశోధన కేంద్రం సైతం కమ్మర్‌పల్లిలో కొనసాగుతోంది. ఈ రెండు సంస్థలు ఉన్నా పసుపు విత్తనోత్పత్తికి మార్గం చూపడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పసుపు పరిశోధన కేంద్రంలో విత్తనం పసుపు కోసం సాగు చేస్తున్నా ఏటా తక్కువ మొత్తంలోనే రైతులకు విత్తనం అందిస్తున్నారు. వచ్చే వర్షాకాలం సీజనుకు ఈసారి కేవలం 35 క్వింటాళ్ల పసుపు విత్తనం పంపిణీ చేశారు. ఒక క్వింటాలు విత్తనానికి ధరను రూ.3 వేలుగా నిర్ణయించారు. ఇక్కడ పంపిణీ చేసిన పసుపు విత్తనం కేవలం 8 నుంచి 9 ఎకరాలకు మాత్రమే సరిపోతుంది. అంటే పసుపు విత్తనోత్పత్తి నామమాత్రంగానే సాగవుతోందని స్పష్టమైతుంది. పసుపు బోర్డు ఏర్పడి ఏడాది కావస్తున్నా విధివిధానాలు ఖరారు కాకపోవడంతో రైతులకు ప్రోత్సాహం అందడం లేదనే వాదన వినిపిస్తోంది. పసుపు విత్తనం తక్కువ ధరకు మార్కెట్‌లో లభించే ఏర్పాట్లు చేస్తే రైతులకు భారం తప్పడంతో పాటు ఎంతో ప్రోత్సాహంగా ఉంటుందని పలువురు వెల్లడిస్తున్నారు. వచ్చే వర్షాకాలం సీజనులో పసుపు సాగు చేయడానికి సన్నద్ధం అవుతున్న రైతులు పసుపు విత్తనాన్ని శుద్ధి చేసుకునే పనిలో ఉన్నారు. మునుముందు సీజనుల కోసమైనా పసుపు విత్తనోత్పత్తిపై దృష్టిసారించాలని పలువురు సూచిస్తున్నారు.


