తెయూ(డిచ్‌పల్లి): జిల్లాలో ప్రభుత్వ వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని, కానీ ఆ కళాశాలను తెలంగాణ యూనివర్సిటీ భూముల్లో కాకుండా జిల్లాలో ఎక్కడైనా ఏర్పాటు చేయాలని ఏబీవీపీ నాయకులు అన్నారు. తెయూ సెంట్రల్ లైబ్రరీ వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏబీవీపీ కార్యదర్శి సమీర్ మాట్లాడారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఎమ్మెల్యేలు, తెయూ వీసీ, రిజిస్ట్రార్ వెంటనే స్పందించి యూనివర్సిటీ భూములను కాపాడా లని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. నాయకులు సంజీవ్, సతీష్, కృష్ణ, శ్రీనివాస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం పున:సమీక్షించాలి
తెయూ(డిచ్‌పల్లి): యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్‌లో ప్రభుత్వ వ్యవసాయ కళాశాల ఏర్పాటు నిర్ణయాన్ని పున:సమీక్షించాలని విద్యార్థి సంఘాల నా యకులు కోరారు. ఈమేరకు వారు మంగళవారం రిజిస్ట్రార్ యాదగిరికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయం వల్ల తెయూలో నూతన కోర్సులు, భవనాలు ఏర్పాటు చేయడానికి భవిష్యత్తులో పెద్ద అడ్డంకిగా మారుతుందన్నారు. అలాగే ప్రభుత్వ వ్యవసాయ కళాశాలను సారవంతమైన నేల, భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్న జిల్లాలోని మరో ప్రాంతంలో ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఏఐఎస్‌ఎఫ్, ఏఐపీఎస్‌యూ, పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాల ప్రతినిధు లు కొమిరె శ్రీశైలం, దీపిక, గణేష్, విగ్నేష్, రఘురాం, నవీన్‌కుమార్, విజయ్, గోపాల్ ఉన్నారు.


