బీజేపీ శ్రేణుల్లో జోష్‌ | - | Sakshi
Sakshi News home page

బీజేపీ శ్రేణుల్లో జోష్‌

May 5 2026 7:20 AM | Updated on May 5 2026 7:20 AM

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: సోమవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో పశ్చిమ బెంగాల్‌, అసోం రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో బీజేపీ ఘనవిజయం సాధించడంతో జిల్లాలోని ఆ పార్టీ శ్రేణులు జోష్‌లో ఉన్నారు. గతంలో భారతీయ జనసంఘ్‌గా ఉన్న బీజేపీ సిద్ధాంత కర్త అయి న డాక్టర్‌ శ్యామాప్రసాద్‌ ముఖర్జీ సొంత రాష్ట్రం బెంగాల్‌లో ఇంతటి భారీ విజయం సాధించడంపై పార్టీ నాయకులు, కార్యకర్తల్లో రెట్టించిన ఉత్సాహం నెలకొంది. మొదటిసారి బెంగాల్‌లో ఘనవిజయం సాధించడం, అసోంలో తిరిగి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం, పుదుచ్చేరిలో మరోసారి ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడంతో జిల్లా కేంద్రంలోని నిఖిల్‌సాయి చౌరస్తాలో పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబురాలు నిర్వహించారు. క్లిష్టమైన బెంగాల్‌లోనే ప్రభుత్వం సాధించిన తమకు తెలంగాణను గెలుచుకోవడం తేలికేనని నాయకులు చెబుతుండడం గమనార్హం. ఈ ఎన్నికలు పూర్తి కావడంతోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 10న హైదరాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో రాష్ట్రప్రభుత్వ అసమర్థత విషయమై భారీ స్థాయిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. దీన్నిబట్టే ఇక తెలంగాణపై పార్టీ అగ్రనాయకత్వం కచ్చితమైన ఫోకస్‌ చేసినట్లు నాయకులు చెబుతున్నారు. తెలంగాణలోనూ బెంగాల్‌ మాదిరిగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని పేర్కొంటున్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌..

ఎంపీ ధర్మపురి అర్వింద్‌

2028లో జరుగనున్న శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా మా పార్టీ ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి మోదీ ఈ నెల 10న హైదరాబాద్‌లో పరేడ్‌గ్రౌండ్‌లో బహిరంగ సభకు రానున్నారు. తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పునాది వేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ వస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే ప్రధాని ఇక్కడకు అడుగుపెడుతుండడం అంటేనే పక్కా రాజకీయ యాత్రనే. కేసీఆర్‌ది ముగిసిన కథ. రేవంత్‌ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి. రాష్ట్రంలో వచ్చేది మా ప్రభుత్వమే.

పశ్చిమ బెంగాల్‌, అసోం, పుదుచ్చేరిల్లో విజయంతో ఉత్సాహం

ఇక తెలంగాణే లక్ష్యం అంటున్న

ఎంపీ అర్వింద్‌, ఎమ్మెల్యే ధన్‌పాల్‌

ఈ నెల 10న హైదరాబాద్‌లో

బహిరంగ సభపై ఫోకస్‌

Advertisement
 
Advertisement
Advertisement