ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహకాలు
నేడు అంకాపూర్‌లో..
ఆర్మూర్: సాంప్రదాయ వ్యవసాయానికి భిన్నంగా ఉద్యాన పంటలను పండించడం ద్వారా రైతులు శ్రమను తగ్గించుకొని ఆర్థిక పరిపుష్టి పొందవచ్చని ఉద్యాన శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా వ్యవసాయాధారిత ప్రాంతమైన జిల్లాలో రైతులను ఉద్యాన పంటలవైపు ప్రోత్సహిస్తూ అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో ఉద్యాన శాఖ తోడ్పాటును అందిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వర్షా కాలంలో జిల్లా వ్యాప్తంగా సుమారు 800 ఎకరాల్లో, ఎండా కాలంలో సుమారు రెండు వేల ఎకరాల్లో కూరగాయల పంటలను రైతులు పండిస్తున్నారు. అందులో భాగంగా తీగ బీర (బీర, కాకర, దొండ, పొట్లకాయ, సొరకాయ) వంటి కూరగాయల పెంపకం కోసం పందిరి సాగు చేసుకోవాలనుకొనే రైతులకు 50 శాతం రాయితీని అందిస్తున్నారు. ఒక్క రైతు కనీసం అర ఎకరం సాగు చేసుకోవాల్సి ఉంటుంది. అర ఎకరానికి ఉద్యాన శాఖ గరిష్టంగా రూ.50 వేలకు మించకుండా రాయితీని అందజేస్తుంది. అదేవిధంగా టమాట, వంగ, మిరప నారును జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్ట్సెన్స్ ఆధ్వర్యంలో ఉచితంగా అందజేస్తున్నారు. ఎకరానికి ఎనిమిది వేల మొక్కలను తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక్కో రైతు రెండున్నర ఎకరాల్లో కూరగాయ పంటను సాగు చేసేందుకు నారు తీసుకోవచ్చు. అదేవిధంగా ఉద్యాన పంటలో వేసుకొనే మల్చింగ్ (కప్పు) కోసం 50 శాతం రాయితీ అంటే ఎకరానికి రూ.6400 రాయితీని రైతులకు అందిస్తున్నారు. ఒక్కో రైతు ఐదు ఎకరాల్లో పంట పైన కప్పు కోసం రాయితీ తీసుకోవచ్చు. ఇక మామిడి, జామ, సీతాఫలం, పపాయ, డ్రాగన్ ఫ్రూట్ వంటి పండ్ల తోటలు, బంతి, చామంతి, గల్లార్డియా వంటి ఇతర పూల తోటల సాగును ప్రోత్సహించడానికి ఉద్యాన శాఖ 40 శాతం రాయితీని అందజేస్తుంది. ఒక్కో రైతు గరిష్టంగా ఐదు ఎకరాల్లో పంట పండించడానికి రాయితీని పొందవచ్చు.
ఆయిల్ పామ్ సాగుతో లాభాల బాట
జిల్లాలో ఇప్పటి వరకు 6,206 ఎకరాల్లో ఆయిల్ పామ్‌ను సాగు చేస్తున్నారు. ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోనే 620 మంది రైతులు 1,343 ఎకరాల్లో ఆయిల్ పామ్‌ను సాగు చేస్తున్నారు.
సంప్రదాయ పంటలతోపాటు అదనపు ఆదాయాన్ని పొందాలనుకొనే రైతులు కూరగాయలు, పండ్లు, పూల తోటలను సైతం పెంచడానికి ఉద్యాన శాఖ తోడ్పాటును అందిస్తోంది. ఆసక్తి గల రైతులు అదనపు సమాచారం కోసం 89777 13980 నంబర్‌ను సంప్రదించాలి.
– సంధ్యారాణి, హార్టికల్చర్ ఆఫీసర్, ఆర్మూర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికా రులు రైతులకు ఉద్యాన పంటలపై అవగాహన కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం ఆర్మూర్ మండలం అంకాపూర్‌లోని గురడిరెడ్డి రైతు సంఘంలో ఉద యం 8 గంటలకు అవగాహన సదస్సును నిర్వహిస్తున్నారు. నియోజకవర్గం పరిధిలో ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్, కూరగాయలు, పండ్లు, పూల తోటలు పండించే రైతులకు ఉద్యాన శాఖ (హార్టికల్చర్) అధికారులు అందించే రాయితీలను గురించి వివరించనున్నారు.
పందిరి నిర్మాణానికి రాయితీలు
సద్వినియోగం చేసుకోవాలంటున్న
అధికారులు
నేడు అంకాపూర్‌లో రైతులకు
అవగాహన సదస్సు


