
నేటితో ముగియనున్న స్మార్ట్‌చెక్–42 సర్వే
ఆర్మూర్‌టౌన్: రాష్ట్ర ప్రభుత్వం చిన్నారుల్లో లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దేందుకు నడుంబిగించింది. అందులో భాగంగా గత నెల 15 నుంచి చేపట్టిన స్మార్ట్ చెక్–42 సర్వే శరవేగంగా కొనసాగగా, నేటితో ముగియనుంది. ఎన్‌ఐఈపీ ఐడీ(నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్‌న్ విత్ ఇంటలెక్చువల్ డిసెబిలిటీస్) పేరిట స్మార్ట్ చెక్–42 సర్వే ప్రారంభించింది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5సంవత్సరాల లోపు గల చిన్నారుల వరకు ఏమైన లోపాలు ఉన్నాయా? అనే దానిపై మహిళ శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ టీచర్లు సర్వే నిర్వహించారు.
42 ప్రశ్నలు– 8విభాగాలు..
అంగన్‌వాడీ సిబ్బంది తమ అంగన్‌వాడీ పరిధిలోని చిన్నారుల్లో లోపాలను గుర్తించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్‌హెచ్‌టీస్ యాప్‌లో 42 అంశాల కూడిన వాటితో సర్వే చేయిస్తుంది. ప్రతి ఆంగన్‌వాడీ కేంద్రం పరిధిలో 5 ఏళ్లలోపు పిల్లలందరిని సర్వే చేయాల్సి ఉంటుంది. స్మార్ట్ చెక్–42 సర్వేలో మొత్తం 42 ప్రశ్నలు ఉండగా, 8 విభాగాలుగా సర్వే ఫార్మట్‌లను ఏర్పాటు చేశారు. 8 విభాగాలో అందులో కొన్ని ప్రశ్నలు చేర్చారు. పాలు తాగడంలో ఇబ్బందులు ఉన్నాయా?, చిన్నారి పుట్టిన వెంటనే ఏడ్చిందా?. లేదా? ఇలా ఒక్కో విభాగంలో చిన్నారుల వయస్సును బట్టి ఎదురయ్యే లోపాలను గుర్తించే విధంగా ప్రశ్నలను తయారు చేశారు. ఆర్మూర్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిఽధిలో అంగన్‌వాడీ కేంద్రాల వారీగా అయిదేళ్లలోపు చిన్నారులపై చేపట్టిన సర్వే నేటితో ముగియనుంది. ఉపాధ్యాయినులు తమ ఫోన్ యాప్‌లో ఎస్, నో, ఇతర వివరాలుంటే వాటిని నమోదు చేస్తున్నారు. ప్రతి చిన్నారికి సంబంధించిన సర్వే వివరాలు న్యూట్రీషనల్ హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్ సర్వర్‌లో నిక్షిప్తం అవుతాయి. సర్వే ఫలితాల ఆధారంగా ఏమైనా లోపాలుంటే, అవసరమైన చికిత్స తదితర చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఈ సర్వే ఏప్రిల్ 15న మొదలై నేటితో ముగియనుంది. ఆర్మూర్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిఽధిలో 13 సెక్టార్లు మొత్తం 326 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 5 ఏళ్లలోపు 20977 మంది చిన్నారులు ఉన్నారు. ఇప్పటి వరకు స్మార్ట్‌చెక్‌లో 20058మంది చిన్నారుల సర్వే పూర్తియింది.
పుట్టిన బిడ్డ నుంచి 5ఏళ్ల చిన్నారుల వరకు వివరాలు సేకరిస్తున్న సిబ్బంది
గత నెల 15 నుంచి కొనసాగిన సర్వే
ప్రతి ఇంటిని సర్వే చేశాం..
ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వేలో భాగంగా ప్రతి ఇంటికి అంగన్‌వాడీ టీచర్లు వెళ్లి వివరాలను సేకరించారు. ప్రతి ప్రశ్నను అడిగి, వివరాలు తెలుసుకొని న్యూట్రీషనల్ హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్ సర్వర్‌లో నమోదు చేశారు.
–భార్గవి, ఐసీడీఎస్ సీడీపీవో, ఆర్మూర్

నేటితో ముగియనున్న స్మార్ట్‌చెక్–42 సర్వే