
ఎవరి జాబితా వారిదే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఆర్మూర్ నియోజకవర్గంలో రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఎవరికివారే అన్నట్లుగా అధికార కాంగ్రెస్, నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే ప్రత్యేకంగా జాబితాలు పంపుతున్నారు. ఇరు పార్టీల నుంచి వేర్వేరుగా జాబితాలు వస్తుండడంతో అధికారులు పరేషాన్ అవుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పొద్దుటూరి వినయ్‌రెడ్డి ద్వారా ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ద్వారా బీజేపీ నాయకులు ఎవరికి వారే తమకు నచ్చినవిధంగా లబ్ధిదారుల పేర్లతో జాబితాలు పంపిస్తుండడంతో ఈ నియోజకవర్గంలో ప్రత్యేక వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో అధికారులు ఎవరి జాబితాలను ఫైనల్ చేయాలో అనే విషయమై తేల్చుకోలేకపోతున్నారు. ఇటు చూస్తే అధికార పార్టీ ఇన్‌చార్జి వినయ్‌రెడ్డి, అటు చూస్తే ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి మధ్య అధికారులు నలిగిపోతున్నారు. అసలే రాకేశ్ రెడ్డి బహిరంగంగా, మీడియా ముఖంగా కడిగిపారేసే రకం కావడంతో అధికారులు ఆగమాగం అవుతున్నారు. దీంతో చేసేదేమీ లేక వచ్చిన జాబితాల్లోని పేర్లను కాదనకుండా కంప్యూటర్‌లో నమోదు చేస్తున్నారు.
అభివృద్ధి పనుల్లోనూ..
ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తులు చేసుకునే విషయంలోనూ ఈ నియోజకవర్గంలో ప్రజలు ఎవరిని కలవాలనే విషయమై గందరగోళానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డితోపాటు వినయ్‌రెడ్డిలను కలుస్తూ దరఖాస్తులు ఇస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో అభివృద్ధి పనుల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గ్రామాల్లోని ఆయా పార్టీల నాయకులు ఎమ్మెల్యే, వినయ్‌రెడ్డిలను కలిసి ఎవరికి వారుగా ప్రతిపాదనలు తయారు చేసి పంపుతున్నారు. ఈ ప్రతిపాదనల్లో వేటికి ప్రాధాన్యం ఇవ్వాలో అనే విషయమై అధికారులు కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉండాల్సి వస్తోంది. మరోవైపు పోలీసులు సైతం పరేషాన్ అవుతున్నారు. కొన్నిసార్లు ఒకే కేసు విషయమై ఇరుపార్టీల నాయకులు వేర్వేరు వర్గాల తరఫున ఫోన్ చేస్తే ఇబ్బందులు పడుతున్నారు. అధికార పార్టీ తరఫున వచ్చిన వారికి అనుకూలంగా వ్యవహరిస్తే ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి వర్గీయుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయని, సందర్భాన్ని బట్టి ఎదుటి వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తే అధికార పార్టీ బడా నేతల ఆగ్రహానికి గురవుతున్నామని వాపోతున్నారు.
రాజీవ్ యువ వికాసానికి..
ఆర్మూర్ నియోజకవర్గంలో
కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ
సీఎంఆర్‌ఎఫ్ విషయంలోనూ
ఇదే పరిస్థితి