ఉపాధ్యాయుల లెక్క తేలింది | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల లెక్క తేలింది

Nov 8 2025 7:30 AM | Updated on Nov 8 2025 7:30 AM

ఉపాధ్యాయుల లెక్క తేలింది

ఉపాధ్యాయుల లెక్క తేలింది

● కొన్నిచోట్ల కొరత ● మరికొన్నిచోట్ల మిగులు

లక్ష్మణచాంద:జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పంపిణీ అసమతుల్యంగా కొనసాగుతోంది. కొన్ని మండలాల్లో అధిక సిబ్బంది ఉండగా, మరికొన్ని పాఠశాలల్లో కొరత విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతోంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటు జరగకపోవడంతో తరగతుల నిర్వహణలో అంతరాయం ఏర్పడింది.

140 మంది సర్దుబాటు..

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో 140 మంది ఉపాధ్యాయులను అవసరానికి అనుగుణంగా సర్దుబాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే, మాధ్యమం తేడా, విషయ బోధనా వ్యత్యాసాలు కారణంగా ఈ బదిలీలు నిరర్ధకంగా మారుతున్నాయి. కొందరు ఉపాధ్యాయులు కొత్త పాఠశాలల్లో చేరేందుకు నిరాకరిస్తుండటంతో శాఖకు సవాళ్లు పెరిగాయి.

విద్యార్థులు ఎక్కువ..

ఉపాధ్యాయులు తక్కువ..

ఖానాపూర్‌ మండలంలోని మస్కాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సుమారు 800 మంది విద్యార్థులు ఉన్నారు. కానీ కేవలం 15 మంది రెగ్యులర్‌ టీచర్లు మాత్రమే ఉన్నారు. ఇటీవల మరో ఐదుగురిని సర్దుబాటు చేసినా ఇంకా ఆంగ్లం, హిందీ ఉపాధ్యాయుల కొరత ఉంది. విద్యార్థులు విద్యలో వెనుకబడిపోకుండా గ్రామస్తులు ముందుకువచ్చి, ఆరుగురు వీవీలను నియమించారు. వీరికి ఒకరికి నెలకు రూ.12 వేల వేతనం ఇస్తున్నారు.

ఇతర మండలాల్లో ఇలా..

కుభీర్‌ ఉన్నత పాఠశాలలో ఉర్దూ మీడియం ఫిజికల్‌ సైన్స్‌, ఇంగ్లిష్‌ ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బాసరలో రెండు, మామడ మండలంలో ఒక ఉపాధ్యాయ స్థానం ఖాళీగా ఉంది. విద్యార్థులపై ప్రభావం చూపుతోంది. నియామకాలు చేయక, తాత్కాలిక బదిలీలతోనే పాఠశాలల నిర్వహణ కొనసాగించడం విద్యా నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

శాశ్వత నియామకమే పరిష్కారం

ఉపాధ్యాయుల సరైన సర్దుబాటు లేకపోవడం గ్రామీణ విద్యను అత్యంత ప్రభావితం చేస్తోంది. సర్దుబాట్లతో తాత్కాలిక పరిష్కారం కుదిరినా, విద్యా నాణ్యత మెరుగుపడటానికి కొత్త నియామకాలు తప్పనిసరి. విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని సబ్జెక్ట్‌–వాయిస్‌ తగిన సిబ్బంది నియామకం జరిగితేనే విద్యలో సమానత్వం సాధ్యమవుతుంది.

విద్యాశాఖ లెక్కల ప్రకారం జిల్లా

ఉపాధ్యాయుల వివవరాలు...

మండలం మిగులు కొరత

బాసర 3 5

భైంసా 18 14

దస్తురాబాద్‌ 6 2

దిలావర్‌పూర్‌ 3 4

కడెం 5 4

ఖానాపూర్‌ 14 19

కుభీర్‌ 6 6

కుంటాల 5 4

లక్ష్మణచాంద 7 5

లోకేశ్వరం 5 5

మామడ 8 9

ముధోల్‌ 8 11

నర్సాపూర్‌(జి) 3 3

నిర్మల్‌ అర్బన్‌ 7 21

నిర్మల్‌ రూరల్‌ 5 5

సారంగపూర్‌ 13 12

సోన్‌ 10 02

తానూర్‌ 10 9

పెంబి 1 00

జిల్లా సమాచారం...

మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 711

విద్యార్థుల సంఖ్య 45,057

ఉపాధ్యాయుల సంఖ్య 2,548

సర్దుబాటు చేయాల్సిన ఉపాధ్యాయులు 140

సర్దుబాటు అయిన ఉపాధ్యాయులు 137

అధికారుల ఆదేశాల మేరకు..

రాష్ట్ర పాఠశాల డైరెక్టర్‌ ఆదేశాల మేరకు, కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ సూచనలతో జిల్లాలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలల నుంచి తక్కువ మంది ఉన్న పాఠశాలల్లో సర్దుబాటు చేశాం. సర్దుబాటులో వెళ్లిన ఉపాధ్యాయులు ఆ పాఠశాలలోనే విధులు నిర్వహించాలి.

– భోజన్న, డీఈవో, నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement