జీరో దందా..! | - | Sakshi
Sakshi News home page

జీరో దందా..!

Nov 8 2025 7:30 AM | Updated on Nov 8 2025 7:30 AM

జీరో దందా..!

జీరో దందా..!

● ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు హార్డ్‌వేర్‌ అక్రమ రవాణా ● పన్నులు చెల్లించకుండా తప్పించుకుంటున్న వ్యాపారులు

భైంసాటౌన్‌:జిల్లాలో జీరో దందా యథేచ్ఛగా జరుగుతోంది. పన్నులు చెల్లించకుండా అక్రమార్కులు రూ.కోట్లాది విలువైన సరుకులు తరలిస్తున్నారు. జిల్లాకు మహారాష్ట్ర సరిహద్దుగా ఉండడంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి జీరోలో సరుకులు సరఫరా అవుతున్నాయి. స్థానిక వ్యాపారులు సైతం పన్నులు తప్పించుకునేందుకు జీరోలో సరుకులు దిగుమతి చేసుకుంటున్నారు. వాణిజ్య పన్నుల శాఖ అధికారుల తనిఖీల్లో పట్టుబడితే సరి.. లేదంటే అంతే సంగతి అన్నచందంగా మారింది. ముఖ్యంగా నిర్మాణ రంగ సామగ్రి జీరోలో భారీగా దిగుమతి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

జీఎస్టీ తర్వాత..

జీఎస్టీ ఏర్పాటు తర్వాత కమర్షియల్‌ ట్యాక్స్‌ అధి కారులకు పనిలేకుండా పోయింది. జిల్లాలో వ్యాపారాలు ఎలా సాగుతున్నాయి, నిబంధనలు ఏ మేర కు అమలవుతున్నాయి.. ప్రభుత్వానికి సక్రమంగా టాక్స్‌ చెల్లింపులు జరుగుతున్నాయా.. అనే విషయాలపై సరిగా దృష్టి పెట్టడం లేదు. అధికారుల అలసత్వాన్ని ఆసరాగా తీసుకుంటున్న కొందరు వ్యాపారులు జీరో దందాకు తెరలేపుతున్నారు. రూ.కోట్లలో అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్నారు.

అక్రమంగా స్టీల్‌ వ్యాపారం..

నిర్మాణ రంగానికి సంబంధించి జిల్లాలో స్టీల్‌ వ్యాపారం జీరోలో సాగుతున్నట్లు తెలుస్తోంది. రెండురోజుల కిందట వాణిజ్య పన్నుల శాఖ అధికా రుల తనిఖీల్లో ఓ ఐరన్‌ లోడ్‌ లారీ పట్టుబడడమే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ముఖ్యంగా భైంసా పట్టణకేంద్రంలో పలువురు హార్డ్‌వేర్‌ వ్యా పారులు ఎలాంటి బిల్లులు లేకుండా మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి జీరోలో స్టీల్‌ రాడ్‌ దిగుమతి చేసుకుంటున్నారు. మహారాష్ట్రలోని జాల్నా నుంచి ఎక్కువ మొత్తంలో ఐరన్‌ అక్రమంగా తీసుకొచ్చి, స్థానికంగా విక్రయిస్తున్నారు. ఇలా జీరో దందా నిర్వహిస్తున్న వ్యాపారులు ప్రభుత్వానికి కోట్ల రూపాయల పన్నులు ఎగవేస్తున్నట్లు తెలుస్తోంది. హార్డ్‌వేర్‌ దుకాణాలే కాకుండా ఇతరత్రా వ్యాపారులు సైతం ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాల్లో జీరోలో సరుకులు తెప్పించుకుంటూ పన్నులు

ఎగ్గొడుతున్నారు.

భైంసా పట్టణంలో రెండురోజుల కిందట వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సరుకు రవాణా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణంలోని ఓ హార్డ్‌వేర్‌ దుకాణ యజమాని రూ.14 లక్షల విలువైన స్టీల్‌ రాడ్‌ లోడ్‌ ఎలాంటి బిల్లులు లేకుండా దిగుమతి చేసుకున్నాడు. దీంతో సంబంధిత అధికారులు గుర్తించి లారీని పట్టుకున్నారు. ఈ మేరకు దుకాణ యజమానికి రూ.2.16 లక్షల వరకు జరిమానా విధించినట్లు తెలిసింది.

అక్రమ దందా నిర్వహిస్తే చర్యలు..

బిల్లులు లేకుండా సరుకులు తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అక్రమ వ్యాపారాలు చేస్తూ ప్రభుత్వానికి పన్ను ఎగవేయడం చట్టరీత్యా నేరం. వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తాం. అక్రమంగా సరుకులు దిగుమతి చేసుకుంటే పన్నుతోపాటు వందశాతం జరిమానా విధిస్తాం. – ఈశ్వర్‌,

కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారి, నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement