
చోరీకి పాల్పడిన ముగ్గురు అరెస్ట్
ఆదిలాబాద్‌టౌన్: మత్తు పదార్థాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. సోమవారం టూటౌన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం తెల్లవారుజామున పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గుర్ని విచారించగా చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. శనివారం రాత్రి రిమ్స్ ఆస్పత్రి పక్కన గల సాయిసేవ ఆస్పత్రిలోని మెడికల్ షాపులో చోరీకి పాల్పడ్డారని, ఒక సెల్‌ఫోన్‌తో పాటు రూ.200 నగదు, టర్మైన్ ఇంజక్షన్లు, మెడజాలమ్ ఇంజెక్షన్లను ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. మత్తుపదార్థాలకు అలవాటుపడిన వారు మత్తులో ఉండటానికి ఇలాంటి ఇంజక్షన్ల చోరీకి పాల్పడినట్లు వివరించారు. ఈనెల 22న మోయిజ్ మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో, 23న దస్నాపూర్‌లోని దుర్గామాత మందిరంలో, 28న సాయిఫాస్ట్‌ఫుడ్ సెంటర్ పక్కన గల కిరాణ దుకాణంలో చోరీకి పాల్పడినట్లు తెలిపారు. అరెస్టు చేసిన వారిలో న్యూహౌజింగ్‌బోర్డుకు చెందిన మహ్మద్ మోయిజ్, చిల్కూరి లక్ష్మీనగర్‌కు చెందిన షేక్ సమీర్, షేక్ అబ్దుల్ ఉన్నట్లు పేర్కొన్నారు.