
రంజనిలో ఎర్రచందనం సాగు
● పంట కాలపరిమితి పదిహేనేళ్లు ● అంతర పంటల సాగుకు అవకాశం ● లాభసాటి అంటున్న అధికారులు
ప్రభుత్వ ప్రోత్సాహం లేదు
నేను ఐదేళ్ల క్రితం ఎకరన్నరలోఎర్రచందనం మొ క్కలు నాటాను. ప్రారంభంలో ఉద్యానవనశాఖ, ఉపాధిహామీ అధికారులు వచ్చి చూశారు. కానీ.. ఇప్పటివరకు నయాపైసా రాలేదు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరింతమంది రైతులు సాగు చేసేందుకు ముందుకువస్తారు.
– సట్ల మహేందర్, రైతు, రంజిని
కుభీర్: మండలంలోని రంజని గ్రామానికి చెందిన సట్లావార్ మహేందర్ మిగతా రైతుల కంటే భిన్నంగా ఆలోచించాడు. ఉద్యానవన, ఉపాధిహామీ అధి కారుల సూచనలు, సలహాలతో ఎకరన్నరలో ఎర్ర చందనం సాగు చేశాడు. ములుగు జిల్లా నుంచి తె చ్చిన 500 ఎర్రచందనం మొక్కలను 10 ఫీట్ల పొడ వు, వెడల్పుతో నాటాడు. మధ్యలో అంతరపంటగా సరుగు మొక్కలు కూడా నాటి సంరక్షిస్తున్నాడు. ఎ ర్రచందనం పంట కాలపరిమితి 15 ఏళ్లు కాగా మొ క్కలు నాటి ఐదేళ్లవుతోంది. మరో పదేళ్లలో పంట చేతికి రానున్నట్లు రైతు మహేందర్ తెలిపాడు.
సాగు విధానం ఇలా..
రెండు ఫీట్ల గోతిలో పశువుల ఎరువు, ఇతర సేంద్రియ ఎరువు వేసి మొక్కలు నాటాలి. ప్రతీ ఆర్నెళ్లకో సారి సేంద్రియ ఎరువు వేయాలి. కలుపు ఎక్కువైతే గడ్డి మందు పిచికారి చేయాలి. వారానికోసారి నీటి తడులు ఇవ్వాలి. ఎర్రచందనం పరాన్న మొక్క కావడంతో మధ్యలో సరుగు మొక్కలు నాటాలి. దీంతో సరుగు మొక్కల వేర్ల నుంచి ఎర్రచందనం మొక్క ఆహారం తీసుకుంటుంది. దీనికి పూత వచ్చి కాయలు కూడా కాస్తాయి. చీడపీడలు ఏమీ ఉండవు. చె ట్టు కాండానికి రంధ్రం ఏర్పడుతుంది. అప్పుడు క్లో రిఫైయిడ్ మందును ఇంజక్షన్ ద్వారా రంధ్రంలో వే యాలి. ఈ పంటలో అంతరపంటగా కంది, పసుపు తదితర పంటలు కూడా సాగు చేసుకోవచ్చు.
ఇవీ.. ఉపయోగాలు
ఎర్రచందనాన్ని సబ్బులు, ఆయుర్వేద మందుల త యారీకి ఉపయోగిస్తారు. రక్తం శుద్ధి కావడానికి, కి డ్నీ సంబంధిత వ్యాధులను నయం చేసుకోవడానికి దీని ద్వారా తయారైన మందులు ఉపయోగిస్తారు. రష్యా, చైనాలో దీని కలపతో తయారైన వంటపాత్రలు వాడతారు. ఒక్కో చెట్టునుంచి సుమారు 15 నుంచి 20కిలోల ఎర్ర చందనం దుంగలు వస్తాయి. కిలో ఎర్రచందనం విలువ రూ.10వేల నుంచి రూ.12 వేల వరకు ఉంటుంది. ఏపీలోని రాయలసీమ, నల్లమల అడవుల్లో ఉండే ఈ చెట్లను ఇక్కడి రైతులు సాగు చేసేలా ఉద్యానవనశాఖ అధికారులు ప్రోత్సహిస్తున్నారు. నర్సరీల్లో ఎర్రచందనం మొక్కలు పెంచి రైతులు సాగు చేసేలా చూస్తున్నారు. 15 ఏళ్ల తర్వాత ఒక్కో చెట్టుద్వారా రూ.లక్షన్నర నుంచి రూ.2లక్షల వరకు ఆదాయం వస్తుంది. లాభసాటిగా మారిన ఎర్రచందనం సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.

రంజనిలో ఎర్రచందనం సాగు