
సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలి
● కార్మిక సంఘాల జేఏసీ పిలుపు
శ్రీరాంపూర్: కేంద్రం కొత్తగా తెచ్చిన 4 లేబర్ కోడ్‌లకు నిరసనగా జూలై 9న జరిగే దేశ వ్యాప్త సమ్మెను సింగరేణిలో విజయవంతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. నస్పూర్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏఐటీయూసీ అధ్యక్షుడు వి.సీతారామయ్య, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి ఏనుగు రవీందర్‌రెడ్డి, ఐఎఫ్‌టీయూ అధ్యక్షుడు విశ్వనాథ్ మాట్లాడారు. కేంద్రం 44 కార్మిక చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్‌లను తీసుకువచ్చిందన్నారు. ఈ కోడ్‌లు జూలై నుంచి అమలు చేయడానికి కేంద్రం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఇవి అమలైతే కార్మికవర్గం తమ హక్కులను కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం, సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేసే హక్కును కూడా కోల్పోతారన్నారు. కార్మిక సంఘాల ఉనికిని ప్రశ్నార్థకం అవుతుందని తెలిపారు. దీనిని కార్మికవర్గం ముక్తకంఠంతో వ్యతిరేకించాలన్నారు. ఈ సమ్మె విజయవంతంతో కేంద్రం దిగివస్తుందన్నారు. అవసరమైతే నిరవధిక సమ్మెకు కూడా సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కే సమ్మయ్య, బ్రాంచి కార్యదర్శి షేక్ బాజీసైదా, నాయకులు కొమురయ్య, కిషన్‌రావు, ఐఎన్టీయూసీ కేంద్ర ఉపాధ్యక్షులు గరిగే స్వామి, ల్యాగల శ్రీనివాస్, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, బ్రాంచి ఉపాధ్యక్షుడు బండి రమేశ్, సీఐటీయూ బ్రాంచి అధ్యక్షుడు గుల్ల బాలాజీ, కస్తూరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.