
పంట పెట్టుబడికి రైతు భరోసా
నిర్మల్ రూరల్: పంట పెట్టుబడికి ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా వెన్నుదన్నుగా నిలుస్తుందని కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. మండలంలోని న్యూ పోచంపాడ్ గ్రామ రైతువేదికలో మంగళవారం నిర్వహించిన రైతు భరోసా సంబురాల్లో కలెక్టర్ పాల్గొన్నారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన రైతుభరోసా సంబరాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రైతులతో మాట్లాడారు. హైదరాబాదులోని రైతునేస్తం వేదిక నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రితోపాటు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతు భరోసా పథకం ద్వారా విత్తనాలు, ఎరువులు, యాంత్రికరణ పనుల కోసం అవసరమైన పెట్టుబడిసాయంతో రైతులకు మేలు చేకూరుతుందని తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని 1,85,116 మంది రైతుల ఖాతాల్లో రూ.260.80 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, తహసీల్దార్ సంతోష్, ఎంపీడీవో గజానన్, ఏవో వసంత్ కుమార్, రైతులు పాల్గొన్నారు.
● కలెక్టర్ అభిలాష అభినవ్