
జిల్లాస్థాయి పోలీస్ డ్యూటీ మీట్
నిర్మల్‌టౌన్: జిల్లా స్థాయిలో పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతిభను వెలికితీసేందుకే జిల్లా స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో జిల్లాలో మొట్ట మొదటిసారిగా పోలీస్ డ్యూటీ మీట్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం సాధించాలన్నారు. అదేవిధంగా న్యాయ నిరూపణ జరగాలంటే సరైన ఆధారాలు సేకరించాలని సూచించారు. డీజీపీ ఆదేశాల మేరకు జిల్లాస్థాయి పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ డ్యూటీ మీట్‌లో పోలీస్ అధికారులు నిరంతరం నిర్వహించే విధులకు సంబంధించి, వివిధ విభాగాలలో పోటీలు నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా కంప్యూటర్, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్, హ్యాండ్లింగ్, ప్యాకింగ్ లిఫ్టింగ్, బాంబ్ డిస్పోజల్, పోలీస్ జాగిలాల విభాగంలో ట్రాకింగ్, ఎక్స్‌ప్లోజివ్, ఫొటో, వీడియోగ్రఫీ విభాగాల్లో పోటీలు ఉంటాయని వివరించారు. ఈ పోటీలలో రాణించిన వారిని జోనల్‌స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌కు పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఉపేంద్రారెడ్డి, డీఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సమ్మయ్య, ఆర్‌ఐలు రామ్‌నిరంజన్, శేఖర్, రమేశ్, రామకృష్ణ, ఆర్‌ఎస్సైలు, డాగ్‌స్క్వాడ్ బృందం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.