
ప్రజావాణి.. పరిష్కారం ఏది?
● ఒకే సమస్యపై పదే పదే అర్జీలు ● వివిధ కారణాలతో కాలయాపన ● సోమవారం గ్రీవెన్స్‌కు 117 అర్జీలు
సదరం సర్టిఫికెట్ ఇవ్వాలి..
మేము తలసేమియా, సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్నాం. మాకు ఇంతవరకు సదరం సర్టిఫికెట్ ఇవ్వలేదు. పెన్షన్ రావడం లేదు. వేరే రాష్ట్రాలలో సదరం సర్టిఫికెట్ ఇస్తున్నారు. మాకూ కూడా సదరం సర్టిఫికెట్ ఇప్పించి ఆదుకోవాలి.
– తల సేమియా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు
నిర్మల్‌చైన్‌గేట్: ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల ఫిర్యాదులు స్వీకరిస్తున్నా.. సమస్యల పరిష్కారంలో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదై, సంబంధిత శాఖలకు వెళ్తున్నాయి. కానీ, క్షేత్రస్థాయిలో పరిష్కారం విషయంలో మాత్రం అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. వివిధ కారణాలు చూపుతూ కాలయాపన చేస్తున్నారు. దీంతో బాధితులు మళ్లీ మళ్లీ కలెక్టరేట్‌కు వస్తున్నారు. ఒకే సమస్యపై పలుమార్లు దరఖాస్తులు ఇస్తున్నారు.
అదనపు కలెక్టర్ ఆదేశాలు
సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 117 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ వానాకాలంలో శానిటేషన్, వన మహోత్సవవంలో మొక్కలు నాటడం, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సోన్ తహసీల్దార్‌పై ఫిర్యాదు
సోన్: రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న సోన్ తహసీల్దార్ మల్లేశ్‌రెడ్డిపై చర్య తీసుకోవాలని కలెక్టరేట్ ఎదుట కడ్తాల్ గ్రామానికి చెందిన రైతులు సోమవారం ఆందోళన చేశారు. అనంతరం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. భూసమస్యలపై కార్యాలయానికి వెళ్తే గంటల కొద్ది నిరీక్షించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరక్షరాస్యులైన రైతులను తెలిసినవారు కార్యాలయానికి తీసుకెళ్తే బ్రోకర్లు అంటూ చులకనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎక్కువ మాట్లాడితే మీ సర్వే నంబర్లను రెడ్ మార్క్ చేస్తానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
25 శాతం సీట్లు కేటాయించాలి
విద్యాహక్కు చట్టం – 2009లోని సెక్షన్ 12(1)(సి) ప్రకారం ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు కేటాయించాలి. 2025– 26 విద్యా సంవత్సరం నుంచి జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టంగా అమలు చేయాలి.
– కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ నాయకులు
అంగన్‌వాడీ భవనం నిర్మించాలి..
మేము ఖానాపూర్ మున్సిపాలిటీ మూడో వార్డు అంబేద్కర్ నగర్ వాసులం. మా కాలనీలో అంగన్‌వాడీ కేంద్రానికి పక్కా భవనం లేదు. నూతన భవనానికి స్థలం ఉంది. చిన్నారుల శ్రేయస్సు కోసం కొత్త భవనం నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలి. అదే విధంగా కాలనీలోని బెల్ట్ షాపు, కల్లు దుకాణం తొలగించాలని కోరారు.
– ఖానాపూర్ మూడోవార్డు వాసులు

ప్రజావాణి.. పరిష్కారం ఏది?

ప్రజావాణి.. పరిష్కారం ఏది?

ప్రజావాణి.. పరిష్కారం ఏది?

ప్రజావాణి.. పరిష్కారం ఏది?