
సామాన్యులకు అండగా పోలీసులు
● ఎస్పీ జానకీ షర్మిల
నిర్మల్‌టౌన్: సామాన్యులకు పోలీసులు అండగా ఉండాలని ఎస్పీ డాక్టర్ జానకీ షర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఎస్పీ వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సామాన్యులకు అండగా ఉండాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నాణ్యమైన పోలీసు వ్యవస్థను జిల్లా ప్రజలకు అందించడమే లక్ష్యమన్నారు. పోలీసుల సహాయం కావాలనుకునేవారు ఠాణాలో నిర్భయంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడినా, సంఘ వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
డ్రగ్ రహిత సమాజమే లక్ష్యం
నిర్మల్‌టౌన్: డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘ జాగ్రత్త మాదకద్రవ్యాలు మీ జీవితాన్ని నాశనం చేస్తాయి‘ డ్రగ్స్ నో చెప్పండి’ అనే పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. అనంతరం ‘ఐ యామ్ యాంటీ డ్రగ్ షోల్జర్‘ అనే సెల్ఫీ పాయింట్ వద్ద ఫొటోలు దిగి ‘సే నో టు డ్రగ్స్ ఎస్ టు లైఫ్’ అనే పోస్టర్‌పై సంతకాలు చేశారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారాన్ని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో నంబర్ 8712671111కు లేదా డయల్ 100 లేదా మీ పరిధిలో ఉన్న పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి, ఏవో యూనస్ అలీ, డీఎస్బీ ఇన్‌స్పెక్టర్ సమ్మయ్య , ఆర్‌ఐ రామ్ నిరంజన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.