
బతికుండగానే చంపేశారు..!
ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధుడి పేరు చవాన్ సోమల. కుబీర్ మండలం కసర గ్రామానికి చెందిన సోమల ఉమ్మడి రాష్ట్రంలో రూ.200 పింఛన్ తీసుకున్నాడు. రాష్ట్ర విభజన తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇంట్లో ఒకరికే పెన్షన్ విధానం తెచ్చింది. దీంతో సోమల పెన్షన్ కట్‌చేసి.. ఆయన భార్య తిత్రీబాయికి వితంతు పెన్షన్ రూ.2 వేలు మంజూరు చేసింది. ఈ సమయంలో సోమల బతికి ఉండగానే చనిపోయినట్లు నమోదు చేశారు. రెండేళ్ల క్రితం తిత్రీబాయి మరణించింది. తనకు వృద్ధాప్య పెన్షన్ తనకు ఇవ్వాలని సోమల ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. కానీ అధికారులు తాను చనిపోయాడని తిరస్కరించారని, తాను బతికుండగానే చంపేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన గోడును కలెక్టర్‌కు చెప్పుకునేందుకు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చాడు. తనకు వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని అదనపు కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్నాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్