
రిక్త ‘హస్త’మేనా?
● జిల్లా ఆస్పత్రుల్లో భోజనాలకు టెండర్లు ● కాంట్రాక్టర్లకే బాధ్యతలు అప్పగిస్తారా? ● మహిళా సమాఖ్యలకు మొండిచేయేనా? ● వైద్యాధికారుల తీరుపై అనుమానాలు ● నోటిఫికేషన్ నిబంధనలపై సందేహాలు ● టీవీవీపీ కమిషనర్ ఆదేశాలు బేఖాతరు
నిబంధనల ప్రకారమే..
జిల్లా ఆస్పత్రుల్లో డైట్ నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర అధికారులు పేర్కొన్న నిబంధనల ప్రకారమే నిర్వహిస్తాం. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేకుండా పూర్తిచేస్తాం.
– డాక్టర్ సురేశ్‌కుమార్, డీసీహెచ్‌ఎస్
నిర్మల్: రాష్ట్ర ఉన్నతాధికారులు జారీ చేస్తున్న ఆదేశాలు.. అధికారులు వాటిని జిల్లాలో అమలు చేస్తున్న తీరుకు పొంతన లేదు. ఇందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో డైట్ నిర్వహణ ఉత్తర్వులే ఉదాహరణ. సర్కారు దవాఖానాల్లో పేషెంట్లు, డ్యూటీ వైద్యులకు అందించే భోజనానికి సంబంధించిన టెండర్లను మహిళా సంఘాలకు అప్పగించాలని ఇటీవల తెలంగాణ వైద్యవిధాన పరిషత్ (టీవీవీపీ) కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ.. జిల్లాలో టెండర్ల కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌లో మహిళా సంఘాలకు ఇచ్చే విషయాన్ని చిన్నగా పేర్కొన్నారన్న ఆరోపణలున్నాయి. ఈనెల 24తో టెండర్ల దాఖలు గడువు ముగియనుంది.
మహిళా సంఘాలకే ఇవ్వాలని..
రాష్ట్రవ్యాప్తంగా వైద్యవిధాన పరిషత్‌కు చెందిన ఆస్పత్రుల్లో పేషెంట్లకు అందిస్తున్న భోజనం (డైట్)పై ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాల సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో డైట్ తీరును పరిశీలించారు. చాలాచోట్ల అధ్వానంగా ఉండటంతో ప్రభుత్వానికి అసంతృప్తి నివేదిక అందించినట్లు తెలిసింది. ఈ విషయంపై గతనెల 24న రాష్ట్ర సచివాలయంలో సంబంధిత అధికారులు నిర్వహించిన సమీక్షలో చర్చించినట్లు సమాచారం. ఇదే సమావేశంలో గడువు ముగిసిన ఆస్పత్రుల్లో లోకల్/జిల్లా మహిళా సమాఖ్యలకు డైట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని సూచించారు. ఇదే విషయంపై మే 27న టీవీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో మహిళా సమాఖ్యలకే డైట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని స్పష్టం చేసినట్లు తెలిసింది.
సమాఖ్యలకు దక్కేనా?
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలను ప్రోత్సహిస్తోంది. స్వ యంసహాయక సంఘాలను కోటీశ్వరులను చేస్తామని చెబుతోంది. ఇందులో భాగంగానే వారికి అందుబాటులో ఉండే ప్రతీ పని వారికే దక్కేలా చూ స్తోంది. ఈక్రమంలోనే జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అధికశాతం ఐకేపీకే అప్పగించా రు. అలాగే కలెక్టరేట్‌తో పాటు మెడికల్ కాలేజీ వివి ధ చోట్ల క్యాంటిన్ల నిర్వహణ మహిళా సమాఖ్యలకే టెండర్ లేకుండానే ఇచ్చారు. తాజాగా టీవీవీపీ ఆస్పత్రుల్లోనూ డైట్ నిర్వహణ వారికే అప్పగించాలని పేర్కొన్నారు. కానీ.. జిల్లాలో ఇచ్చిన నోటిఫికేషన్ తీరుతో మహిళా సంఘాలు గందరగోళానికి గురవుతున్నాయి. ఓవైపు ప్రభుత్వం నేరుగా మహిళా సంఘాలకే ఇవ్వాలని చెబుతుంటే.. ఇక్కడ టెండర్‌లో అర్హత ప్రకారం అని చెప్పడంపై సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. ఈనేపథ్యంలో ఈ డైట్ నిర్వహణ బాధ్యత మహిళా సంఘాలకు దక్కుతుందా..? లేక పాత కాంట్రాక్టులకే చిక్కుతుందా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
టెండర్‌లో మాత్రం ఇలా..
జిల్లాలో టీవీవీపీ ఆధ్వర్యంలో భైంసా ఏరియా ఆస్పత్రి, నర్సాపూర్, ముధోల్, ఖానాపూర్ ఆస్పత్రులున్నాయి. ఇందులో ప్రస్తుతం భైంసా, ముధోల్, నర్సాపూర్ ఆస్పత్రుల్లో డైట్ నిర్వహణకు సంబంధించి ఇచ్చిన టెండర్‌లో కొంత గందరగోళం నెలకొంది. అందులో పేర్కొన్న తీరే ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహిళా సంఘాలకు ప్రాధాన్యత నివ్వాలని సూచిస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర అధికారులూ ఆస్పత్రుల్లో డైట్ బాధ్యతలు మహిళా సమాఖ్యలకు అప్పగించాలని ఉత్తర్వుల్లో సూచించారు. కానీ.. జిల్లాలో ఇచ్చిన టెండర్ నోటిఫికేషన్‌లో నేరుగా మహిళా సంఘాలు టెండర్ దరఖాస్తులు వేయాలని చెప్పకుండా, ముందుగా ఆసక్తిగల ‘సంస్థలు’ కార్యాలయ వేళల్లో సంప్రదించాలని సూచించడం గమనార్హం. నోటిఫికేషన్ చివరలో ‘అర్హత కలిగిన’ స్థానిక/ జిల్లా మహిళా సమాఖ్యలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. మహిళా సమాఖ్యలకు ఇవ్వడమే మొదటిసారి. అలాంటిది వారికి ఎలాంటి అర్హతలు, అనుభవం చూస్తారని మహిళా సమాఖ్యల సభ్యులు ప్రశ్నిస్తున్నారు.