
అసంపూర్తి బడి
నిర్మల్ రూరల్ మండలం గంగా పూర్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన షెడ్డు లేకపోవడంతో వరండాలోనే మధ్యాహ్న భోజనం వండుతున్నారు. గత విద్యా సంవత్సరం యూడైస్‌లో ఆరుగురు విద్యార్థులు మాత్రమే ఉండగా ఈసారి బడిబాటలో నలుగురు పెరిగి సంఖ్య పదికి చేరింది. ఒకే గదిలో అంగన్‌వాడీ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు చదువుకుంటున్నారు.
నిర్మల్ రూరల్: సర్కారు బడుల్లో విద్యార్థులు సమస్యలతో సతమతం అవుతున్నారు. ప్రభుత్వం అమ్మ ఆదర్శ కమిటీలతో పనులు చేపట్టినా ఇంకా పూర్తిస్థాయిలో సమస్యలు పరిష్కారం కాలేదు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన మన ఊరు–మనబడి పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. తరగతి గదుల నిర్మాణం, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్ల నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం సాక్షి జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలలను విజిట్ చేయగా, ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
– మండలంలోని రానాపూర్ ప్రాథమిక పాఠశాలలో మూడు తరగతి గదులు ఉండగా అందులో ఓ గదిని గ్రామపంచాయతీ కోసం, మరొక గది అంగన్‌వాడీ విద్యార్థుల కోసం ఉపయోగిస్తున్నారు. కొన్నేళ్లుగా కొత్త గ్రామపంచాయతీ భవనం పెండింగ్‌లో ఉండడంతో పరిపాలన మొత్తం పాఠశాల నుంచే జరుగుతుంది. మధ్యాహ్న భోజన షెడ్డు లేకపోవడంతో పాఠశాల ఎదురుగా ఓ ఇంట్లో తయారుచేసి బడికి తీసుకువస్తున్నారు. డ్యాంగాపూర్ ప్రాథమిక పాఠశాలలో 11 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. గురువారం సాక్షి విజిట్ కి వెళ్లినప్పుడు అక్కడ ఉపాధ్యాయుడు, విద్యార్థులు ఎవరూ లేరు. మధ్యాహ్న భోజన భోజనం తయారు చేసే ఓ మహిళ మాత్రమే ఉంది. అడిగితే సారు... కొత్త పుస్తకాలు తేడానికి చిట్యాల బడికి వెళ్లాడని సమాధానం ఇచ్చింది. ఇదే అదనుగా.. బడికి వచ్చిన విద్యార్థులంతా ఇంటికి వెళ్లిపోయారని పేర్కొంది.
ఈ చిత్రం జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ ఉన్నత పాఠశాల లోనిది. ఇక్కడ మొత్తం విద్యార్థుల సంఖ్య 244. ఇందులో 134 మంది బాలికలు ఉన్నారు. కానీ వీరందరికీ ఒకే ఒక టాయిలెట్ ఉండడంతో విద్యార్థినిలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మూడేళ్ల క్రితం మన ఊరు– మనబడి లో కొత్త మరుగుదొడ్లు మంజూరయ్యాయి. అవి కట్టే క్రమంలో ఉన్న మరుగుదొడ్లను కూల్చివేశారు. ప్రస్తుతం పాడుబడ్డ ఓ టాయిలెట్ మాత్రమే ఉంది.

అసంపూర్తి బడి

అసంపూర్తి బడి