
భూసమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు
● కలెక్టర్ అభిలాష అభినవ్
సారంగపూర్: రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు పరిష్కరించేందుకే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మండలంలోని జామ్ గ్రామంలో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సును పరి శీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలకు కారణాలు తెలుసుకున్నారు. గ్రామంలో భూములకు సంబంధించిన ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నా యా అని గ్రామస్తులను అడుగగా 582 సర్వే నంబరులో ఉన్న భూసమస్యలను గురించి రైతులు, గ్రామస్తులు కలెక్టర్‌కు వివరించారు. 582 సర్వే నంబరులోని ప్రభుత్వ భూమిలో అసైన్డ్ పట్టాలు ఇవ్వడంతో ధాన్యం కొనుగోలు కేంద్రానికి స్థలం లేకుండా పోయిందని తెలిపారు. స్పందించిన కలెక్టర్ విచారణ జరిపి కమిటీని ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకున్న ప్రతీ రైతుకు రశీదు ఇవ్వడంతోపాటు తక్షణమే పరిష్కారమయ్యే సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్ శ్రీదేవికి సూచించారు. అవసరమైతే సర్వేయర్ సహాయంతో క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేపట్టాలని ఆదేశించారు.
పాఠశాల తనిఖీ
రెవెన్యూ సదస్సు పరిశీలన అనంతరం గ్రామంలోని ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. స్టాఫ్ రూమ్‌కు వెళ్లి హాజరు రిజిష్టర్లు పరిశీలించారు. అక్క డి నుంచి మధ్యాహ్న భోజనం వంటగదిని పరిశీలించి మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తయారు చేసిన భోజనం పరిశీలించారు. అక్కడి నుంచి నేరుగా పదోతరగతి తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను పలకరించి పలు విషయాలపై ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. పదోతరగతి వార్షిక పరీక్షలకు ముందు నుంచే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని కష్టపడి చదవాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులు అభిలాష్ నెట్‌బాల్‌లో, రమ్య బేస్‌బాల్‌లో జాతీయస్థాయికి ఎంపికైన విషయం తెలుసుకుని అభినందించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, డీఈవో రా మారావు, ఆర్డీవో రత్నకళ్యాణి, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో లక్ష్మీకాంతరావు, ఉపాధ్యాయులు ఉన్నారు.