
మున్సిపాలిటీలో ఏం జరుగుతోంది..?
● అవినీతి పెరిగినందునే ఏసీబీ దాడులు ● అధికారులు నిబద్ధతతో పనిచేయాలి ● ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
నిర్మల్‌టౌన్: ‘అసలు నిర్మల్ మున్సిపాలిటీలో ఏం జరుగుతోంది..? అధికారులు ఏం పని చేస్తున్నారు..? వరుసగా ఏసీబీ దాడులు జరుగుతున్నాయంటే ఇక్కడ ఎంత అవినీతి జరుగుతుందో అర్థమవుతోంది. ప్రజలకు సేవలు అందించకుండా, చేస్తున్న పనులపై కనీసం అవగాహన లేకుండా, కేవలం సంపాదనపైనే దృష్టి పెడతామంటే కుదరదు. అలాంటి అధికారులు ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోవచ్చు. అధికారులు సిబ్బంది నిబద్ధతతో పని చేయాల్సిందే..’ అని బీజేఎల్‌పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ మున్సిపల్ కార్యాలయాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా మున్సిపల్‌లో జరుగుతున్న పనుల గురించి ఆరా తీశారు. ఆయా శాఖలలోని పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం మున్సిపాలిటీలో జరుగుతున్న ఆయా పనుల పురోగతిపై కమిషనర్‌ను అడిగి తెలుసుకున్నారు.
అవినీతిపై ఆగ్రహం...
నిర్మల్ మున్సిపాలిటీ ఇటీవల ముద్రపడ్డ అవినీతికి కేరాఫ్‌గా మారిందంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు వరుసగా జరుగుతున్న ఏసీబీ దాడులే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజలు పనుల నిమిత్తం మున్సిపాలిటీకి వచ్చినప్పుడు ఏం ఆశించకుండా పనులు చేయాలని సూచించారు. నిర్మల్‌లో సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. సమీక్షలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, డీఈ హరిభువణ్, ఆర్‌వో అనుప్‌కుమార్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.