
కలెక్టరేట్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం కనకాపూర్ గ్రామానికి చెందిన బసండ్ల ముత్యం బుధవారం నిర్మల్ కలెక్టరేట్‌లో ఆత్మహత్యాయత్నం చేశాడు. పెట్రోల్ డబ్బాతో కలెక్టరేట్‌కు వచ్చి ఒంటిపై పెట్రోల్ పోసుకుని తనకు న్యాయం చేయాలని కోరాడు. గమనించిన కార్యాలయ సిబ్బంది అతడి నుంచి పెట్రోల్ బాటిల్ స్వాధీనం చేసుకుని పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్ అతడిని స్టేషన్‌కు తరలించి వివరాలు సేకరించారు. ముత్యం మాట్లాడుతూ గ్రామంలోని తన సొంత భూమిని వేరొకరు కబ్జా చేశారని ఆరోపించాడు. కబ్జాదారుడు మూడు రోజుల నుంచి తనను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఏం చేయాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎవరిని ఆశ్రయించాలో తెలియక ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపాడు.
బౌలర్లదే జోరు
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఉమ్మడి జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో అండర్ 19 క్రికెట్ ఎంపిక పోటీలు నిర్వహిస్తుండగా బుధవారం జరిగిన పోటీల్లో బౌలర్లదే హవా కొనసాగింది. రెడ్, బ్లూ జట్ల మధ్య 50 ఓవర్ల మ్యాచ్ జరగ్గా, బ్లూ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 39.5 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రెడ్ జట్టు బౌలర్లు అద్బుతంగా రాణించగా, డి.లక్ష్మణ్ 4 కీలక వికెట్లు సాధించాడు. అనంతరం లక్ష్య చేధనలో రెడ్‌జట్టు 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. శ్రీరామ్ 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడని కోచ్ ప్రదీప్ తెలిపారు.