
బస్సు ఢీకొని ఒకరి మృతి
భైంసారూరల్: మండలంలోని వాలేగాం గ్రామానికి చెందిన బొడిగంవార్ చంద్రశేఖర్ (49) అనే వ్యక్తి దేగాం గ్రామంలో బస్సు ఢీకొట్టిన సంఘటనలో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వాలేగాం గ్రామానికి చెందిన బొడిగంవార్ చంద్రశేఖర్ –సుశీల దంపతులు బుధవారం బాసరకు వెళ్తున్నారు. దేగాం బస్టాండ్ వద్ద బస్సు కోసం వేచిచూస్తున్న క్రమంలో చంద్రశేఖర్‌ను భైంసా నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు దేగాం చేరుకుని న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శంకర్ తెలిపారు.

బస్సు ఢీకొని ఒకరి మృతి