
యూత్ కాంగ్రెస్ నాయకుల బాహాబాహీ
మంచిర్యాలటౌన్: సరస్వతి పుష్కరాలకు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణను ఆహ్వానించకుండా అవమానించడాన్ని నిరసిస్తూ బుధవారం యూత్ కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో నిరసన చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించేందుకు వెళ్తుండగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు వర్గీయులు బూతులు తిడుతూ అడ్డుకున్నారని ఎంపీ వర్గీయులు తెలిపారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతామని చెప్పినా వినకుండా తమను అడ్డుకోవడం సరికాదని యూత్ కాంగ్రెస్ నాయకులు రాయబారపు కిరణ్, ఆసంపల్లి శ్రీకాంత్ అన్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరుగుతుండడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు పున్నం, సృజన్, మాయ తిరుపతి, దాసరి సంపత్, శ్రీశైలం, అరుణ్, రాజేశ్, వెంకటేశ్, రాకేశ్, తదితరులు పాల్గొన్నారు.