సువేందు , అగ్నిమిత్ర పాల్ , రూపా గంగూలీ , దిలీప్ ఘోష్
సువేందు అధికారికి అత్యధిక అవకాశాలు
రాష్ట్ర బీజేపీ చీఫ్ సమిక్ భట్టాచార్య పేరూ పరిశీలనలో
అగ్నిమిత్రపాల్ తదితరులూ పోటీలో..
కమ్యూనిస్టుల కంచుకోటలను బద్దలుకొట్టి 15ఏళ్లు ఏకఛత్రాధిపత్యంగా పశ్చిమబెంగాల్‌ను ఏలిన మమతాబెనర్జీని ఘోరంగా ఓడించి ఇంటికి సాగనంపిన కమలనాథుల్లో ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చిలో ఆసీనులవుతారనే ప్రశ్న తలెత్తింది. ఆ కుర్చీకి తామే అర్హులమంటూ రాష్ట్ర ముఖ్యనేతలు బీజేపీ అధిష్టానం వద్ద వాదనలు గట్టిగా విన్పిస్తున్నారు. వీరి వాదనల్లో ఎవరి వాదనకు అగ్రనేతలు మోదీ, అమిత్‌షా ద్వయం సమ్మతి తెలుపుతుందో త్వరలో తేలిపోనుంది.
అయితే మమతను ఒంటిచేత్తో మట్టికరిపించిన రాష్ట్ర రాజకీయ దురం«ధరుడిగా ఘనత సాధించిన సువేందు అధికారికే సీఎం పీఠం దక్కే అవకాశముందని ఊహాగానాలు ఎక్కువయ్యాయి. అయితే గుజరాత్ మొదలు మధ్యప్రదేశ్, హరియాణా, ఉత్తర ప్రదేశ్‌దాకా ప్రతిసారీ కొత్త ముఖాలకు అవకాశమిచి్చన బీజేపీ అధిష్టానం ఈసారి పశ్చిమబెంగాల్‌లోనూ కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే ఆస్కారముందనే వాదనా తెరమీదకొచి్చంది. ఈ నేపథ్యంలో ఐదారుమంది నేతల పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. వారి గురించి క్లుప్తంగా..
సువేందు అధికారి..
బెంగాల్‌లో అత్యధిక మందికి చిరపరిచితమైన నేత. గతంలో మమతాబెనర్జీకి కుడిభుజంగా ఉంటూ నందిగ్రామ్‌లో రైతు ఉద్యమాన్ని ముందుకు నడిపించిన నేత తర్వాత టీఎంసీకి తిలోదకాలిచ్చి కమలదళంలో చేరి కీలక నేతగా ఎదిగారు. గతంలో నందిగ్రామ్‌లో మమతను ఓడించి ఈసారి భవానీపూర్‌లోనూ మమతకు ఓటమి రుచిచూపించారు. క్షేత్రస్థాయిలోనూ పార్టీపై పట్టుసాధించిన సువేందుకు సీఎం అయ్యే అవకాశాలు మిగతావారికంటే మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నారదా స్టింగ్ ఆపరేషన్ ఉదంతంలో లంచం తీసుకుంటూ కెమెరా కంటికి చిక్కి పరువుపోగొట్టుకున్నారు.
సమిక్ భట్టాచార్య
ఆర్‌ఎస్‌ఎస్ మూలాలున్న భట్టాచార్య ఇటీవలే పశ్చిమబెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలు ఆరంభించారు. ఎన్నికల్లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు. అగ్రనేతల సుడిగాలి పర్యటనలను సమన్వయంచేసుకుంటూనే సొంతంగా పలు ప్రచారకార్యక్రమాల్లో పాల్గొని టీఎంసీపై పదునైన విమర్శనాస్త్రాలు సంధించి ప్రజల్లో గుర్తింపుపొందారు. పార్టీలో నేతలను ఏకతాటి మీదకు తీసుకురావడంలో దిట్టగా పేరొందారు. కులమతాలకతీతంగా అన్ని వర్గాల్లోనూ పార్టీని విస్తరింపజేసే సత్తా ఈయనకు ఉందని అగ్రనాయకత్వంలోనూ ఈయన మంచిపేరు సంపాదించారు. ఈయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందనే మాటా విన్పిస్తోంది.
అగ్నిమిత్ర పాల్
గతంలో వృత్తిరీత్యా ఈమె ఒక ఫ్యాషన్ డిజైనర్. బెంగాల్‌లో ముందంజలో ఉండి పార్టీని నడిపించే క్రియాశీలక మహిళా నేతల్లో ఈమె కూడా ఒకరు. బీజేపీ మహిళా మోర్చాకు గతంలో అధ్యక్షురాలిగా సేవలందించారు. తర్వాత రాష్ట్ర ఉపాధ్యక్షురాలి స్థాయికి ఎదిగారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అసన్‌సోల్ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి గతంలో పట్టభద్రురాలైన ఈమె తరచూ మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
రూపా గంగూలీ
దిగ్గజ నిర్మాత, స్క్రీన్‌రచయిత బీఆర్ చోప్రా తెరకెక్కించిన అద్భుత సీరియల్ ‘మహాభారత్’లో ద్రౌపది పాత్రతో యావత్ భారతానికి చిరపరిచితమైన నటి రూపా గంగూలీ. బీజేపీ రాజ్యసభ సభ్యురాలిగా పశ్చిమ బెంగాల్ ప్రజలకు ఎంతో దగ్గరయ్యారు. తర్వాత సోనానూర్ దక్షిణ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది నియోజకవర్గంలో ఓటర్లకు అందుబాటులో ఉంటూ మంచి పేరుతెచ్చుకున్నారు. బెంగాల్ బీజేపీ మహిళా మోర్చాకు అధ్యక్షురాలిగా రెండేళ్లు సేవలందించారు. ఆకాలంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
దిలీప్ ఘోష్
బీజేపీ ఫైర్‌బ్రాండ్‌గా పేరొందారు. గతంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు. 2021లో పార్టీ టీఎంసీకి గట్టిపోటీ ఇవ్వడంలో సఫలీకృతమయ్యారు. ఆనాడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమంటే వామపక్షలు, కాంగ్రెస్ కాదు అని బీజేపీయే ప్రజల పక్షాన పోరాడుతోందని నిరూపించే ప్రయత్నంచేశారు. తక్కువకాలంపాటే బీజేపీ రాష్ట్ర శాఖ చీఫ్‌గా కొనసాగినా వ్యవహారాలను చక్కబెట్టడంలో తనదైన ముద్రవేశారు. సీఎం రేసులో తానూ ముందంజలో ఉన్నానని నిరూపించుకున్నారు. గతంలో ఆర్‌ఎస్‌ఎస్‌లో పనిచేశారు. 12 సంవత్సరాల క్రితం బీజేపీలో చేరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కష్టపడిపనిచేసి త్వరగానే రాష్ట్ర చీఫ్ స్థాయికి ఎదిగారు. అయితే వాచాలత్వంతో తరచూ వివాదాస్పద వ్యాఖ్యానాలుచేస్తూ అప్రతిష్ట తెచ్చుకోవడం ఈయనకు రివాజుగా మారింది. అయినాసరే రాజకీయ చతురతతో నెగ్గుకురాగల సమర్థుడని ఆయనకుపేరుంది. సువేందుకు ఈయన ఒక్కరే గట్టిపోటీ ఇచ్చే అవకాశముంది. – సాక్షి, నేషనల్ డెస్క్


