చెన్నై: తమిళనాడు రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్‌ని తలపిస్తున్నాయి. ఇప్పటికి మద్దతు లెక్కలు తేలలేదు. విజయ్ ప్రమాణ స్వీకారంపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే నేత పళనిస్వామి పోస్ట్ వైరల్‌గా మారింది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ.. పళనిస్వామి కీలక పోస్ట్‌తో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీకి అభినందనలు అంటూ ఎడప్పాడి పళనిస్వామి ట్వీట్ చేశారు. దీంతో విజయ్‌తో వీసీకే పొత్తు ఖాయమైందంటూ ప్రచారం జరుగుతోంది.
తమిళనాడు ఎన్నికల తర్వాత ప్రతిష్టంభన ఒక కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తున్న తరుణంలో పళనిస్వామి వ్యూహాత్మక పోస్ట్ కొత్త చర్చకు దారితీసింది. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్‌కు అవసరమైన మద్దతు లభించిందా? అనే కోణంలో రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఏ పార్టీ పేరునూ నేరుగా ప్రస్తావించకుండానే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న పార్టీకి పళనిస్వామి అభినందనలు తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి.
మొత్తం 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో మెజారిటీ మార్కు 118. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 107 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, స్పష్టమైన మెజారిటీకి కొద్దిగా దూరంలో నిలిచింది. ఈ ఉత్కంఠభరిత వాతావరణంలో ఈపీఎస్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను నివారించడానికి.. అలాగే బీజేపీ పరోక్ష జోక్యాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్, సీపీఐ, CPI(M) పార్టీలు ఇప్పటికే విజయ్‌కు మద్దతు ప్రకటించాయి. ఇప్పుడు అందరి దృష్టి తోల్ తిరుమావళవన్ నేతృత్వంలోని వీసీకే (విడుతలై చిరుతైగల్ కట్చి) పార్టీపై పడింది. ఆ పార్టీ తీసుకునే నిర్ణయమే విజయ్ మెజారిటీ మార్కును దాటడానికి అత్యంత కీలకం కానుంది.
తెరవెనుక విజయ్‌కు అవసరమైన పూర్తి మద్దతు లభించిందనే బలమైన నమ్మకం విపక్ష కూటమిలో వ్యక్తమవుతోందని.. అందుకే పళనిస్వామి ఈ తరహా వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత రెండు రోజులుగా తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటుపై తీవ్ర సస్పెన్స్ కొనసాగుతోంది. వీసీకే పార్టీ తన తుది నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.


