పూజారిపై ఉమ్మిన మహిళ.. జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన సిబ్బంది

Video: Woman Dragged By Hair, Thrown Out Of Temple In Bengaluru - Sakshi

సాక్షి, బెంగళూరు: మహిళపై ఆలయ సిబ్బంది అనుచితంగా ప్రవర్తించిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. బెంగళూరు గుడిలో నుంచి ఓ మహిళను బలవంతంగా బయటకు గెంటేశారు ఆలయ సిబ్బంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.  డిసెంబర్‌ 21న జరిగిన ఈ ఘటనలో బాధితురాలు అమృతహళ్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుడిలో మహిళను కొట్టి జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకెళ్లిన వీడియో ట్విటర్‌లో షేర్‌ చేయడంతో తాజాగా వైరల్‌గా మారింది.

ఇందులో ఆలయం లోపల ఉన్న ఓ మహిళను ఆలయ సిబ్బంది బయటకు నెట్టేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె ప్రతిఘటించడంతో చెంపదెబ్బ కొట్టాడు. అయినా బయటకు వచ్చేందుకు నిరాకరించగా.. మహిళ మెడ పట్టుకొని లాక్కొచ్చాడు. జుట్టు పట్టుకొని బయటకు ఈడ్చుకెళ్లాడు. అప్పటికీ మహిళ మొండిగా ప్రవర్తించడంతో ఆమెను కొట్టేందుకు ఐరాన్‌ రాడ్‌ను కూడా తీసుకొచ్చాడు. అయితే పూజారి అడ్డుకోవడంతో ఆమె బయటకు వెళ్లిపోయింది.

కాగా మహిళ ఆలయ సిబ్బంది అంత దారుణంగా ప్రవర్తించడం వెనక ఓ కారణం ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలు గుడికి వెళ్లి వెంకటేశ్వరుని భార్యనని చెప్పుకుంటూ.. స్వామివారి విగ్రహం పక్కనే కూర్చోవాలని పట్టుబట్టింది. అందుకు పూజారి అనుమతించలేదు. దీంతో మహిళ పూజారిపై ఉమ్మింది. వెంటనే స్పందించిన ఆలయ సిబ్బంది మహిళను జుట్టు పట్టుకొని గుడి నుంచి బయటకు తోసేశారు. అయితే సదరు మహిళ మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు. దీనిపై స్పందించిన పోలీసులు పలు సెక్షన్ల కింద ఆలయ సిబ్బందిపై కేసులు నమోదు చేశారు.
చదవండి: సుప్రీంకోర్టు కీలక ఆదేశం, 50వేల మందికి ఊరట.. ఎవరు వీరు? ఎక్కడి వాళ్లు?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top