ఎన్నికల ఫలితాల అనంతరం ఆనందంతో అభివాదం చేస్తున్న టీవీకే అధినేత విజయ్
అతి పెద్ద పార్టీగా ‘టీవీకే’.. అధికారానికి అడుగు దూరంలో
ఒంటరి పోరులో 107 స్థానాలలో విజయ కేతనం..
చరిత్ర సృష్టించిన మరో ఎంజీఆర్‌గా దళపతి
పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే ప్రభంజనం... తొలి ఎన్నికల్లోనే అధికారం దిశగా అడుగులు
పెరంబూర్, తిరుచిరాపల్లి (ట్రిచీ) ఈస్ట్.. రెండు చోట్లా భారీ ఆధిక్యంతో విజయ్ గెలుపు
త్రిముఖ సమరంలో మట్టి కరిచిన ద్రవిడ పార్టీలు
డీఎంకే కూటమికి 74 సీట్లు.. అన్నాడీఎంకేకు 53 స్థానాలు
సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు దిశగా పరిణామాలు
సాక్షి, చెన్నై: అంచనాలకు ఏమాత్రం అందని విజయం..! ఒంటరి పోరులో ‘దళపతి’ విజయ విహారం..! పెరంబూర్, తిరుచిరాపల్లి (ట్రిచీ) ఈస్ట్ రెండు చోట్లా ‘విజిల్’మోత! చరిత్ర సృష్టించిన మరో ఎంజీఆర్‌గా విజయ్.. రెండేళ్లలోనే బలమైన రెండు ద్రవిడ పార్టీలను మట్టి కరిపించారు.. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించారు.. తమిళనాట సరికొత్త చరిత్ర సృష్టించారు.. అధికార పీఠానికి అడుగు దూరంలో నిలిచారు.
తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభంజనం సృష్టించింది. దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తూ వచ్చిన ద్రవిడ పార్టీల కోటలను బద్దలు కొట్టి అతి పెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. అధికార పీఠానికి మరొక్క అడుగు దూరంలో నిలిచింది. టీవీకే 107 స్థానాలలో విజయం వైపుగా దూసుకెళ్లి ద్రవిడ పార్టీల శకానికి ముగింపు పలికింది. రెండు చోట్లా గెలిచిన ‘దళపతి’ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలలో నిమగ్నమయ్యారు. డీఎంకే అధికారాన్ని కోల్పోగా ఈ కూటమి 74 స్థానాలకు పరిమితమైంది. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే కూటమి 53 స్థానాలను దక్కించుకుంది. తమిళనాడు ఎన్నికలలో మొత్తం 4,023 మంది అభ్యర్థులు పోటీ చేయగా రికార్డు స్థాయిలో 85.15 శాతం ఓటింగ్ నమోదైంది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు డీఎంకే వైపు మొగ్గుచూపగా మరికొన్ని అన్నాడీఎంకేకు అనుకూలంగా వచ్చాయి. యాక్సిస్ మై ఇండియా మాత్రం అధికారం విజయ్‌దే అని స్పష్టం చేసింది. ఇందుకు అనుగుణంగా సోమవారం ఉదయం కౌంటింగ్ ఉత్కంఠగా సాగింది.
ఉత్కంఠ పోరులో..
తమిళనాడులోని 234 అసెంబ్లీ సీట్లకు ఉదయం కౌంటింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ ఓట్ల లెక్కింపులో డీఎంకే తొలుత ఆధిపత్యాన్ని ప్రదర్శించినా క్రమంగా టీవీకే పుంజుకోవడ ం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు, వృద్ధులు, దివ్యాంగుల ఓట్లు టీవీకే ఖాతాలో పడ్డాయి. అనంతరం ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అతి స్వల్ప మెజారిటీతో డీఎంకే, టీవీకే, అన్నాడీఎంకే మధ్య హోరాహోరీ నెలకొంది. రెండు ద్రవిడ పార్టీ లను వెనక్కి నెట్టి ఈవీకే క్రమంగా ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మధ్యాహ్నం సమయానికి డీఎంకే మూడో స్థానంలో నిలవగా అన్నాడీఎంకే రెండో స్థానంలో ఉంది.
అనంతరం 1,000 నుంచి 2 వేల ఓట్ల ఆధిక్యంతో టీవీకే, డీఎంకే మధ్య నువ్వా..నేనా అన్నట్లుగా కౌంటింగ్ ఫలితాలు వెలువడ్డాయి. వంద నియోజక వర్గాలు దాటిన తదుపరి టీవీకే తన ఆధిపత్యం చాటుకుంది. మధ్యాహ్నం సమయానికి పలు నియోజకవర్గాలలో తుది ఫలితం వెలువడాల్సి ఉండగా కొద్దిగా జాప్యమైంది. సాయంత్రం మదురై దక్షిణం నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి గోపీషన్ తొలుత విజయకేతనం ఎగుర వేశారు. అనంతరం అదే పార్టీకి చెందిన సీనియర్ నేత సెంగోట్టయన్ గోబి చెట్టి పాళయంలో విజయం సాధించారు. క్రమంగా టీవీకే అభ్యర్థుల విజయ పర్వం కొనసాగడం మొదలైంది. గెలిచిన వారిలో అత్యధిక శాతం మంది రెండు వేలు, ఐదు వేలు, పది వేలలోపు మెజారిటీకే పరిమితమయ్యారు.
అధికారానికి అడుగు దూరంలో..
తమిళనాడులో అధికార పగ్గాలు చేపట్టేందుకు 118 స్థానాలు అవసరం. ఇప్పటివరకు ద్రవిడ పార్టీలు సంపూర్ణ మెజారిటీతో సంకీర్ణానికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ వచ్చాయి. తాజాగా టీవీకే సునామీ సృష్టించినా అధికారానికి స్పల్ప దూరంలో నిలిచింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో తొలిసారిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడేనా? అనే చర్చ సాగుతోంది. ఫలితాలలో టీవీకేకు నగర ఓటర్లు అండగా నిలిచారు. నగరాలలో 69 నియోజకవర్గాలు ఉండగా 60 స్థానాలను టీవీకే కైవసం చేసుకుంది. గ్రామీణ ప్రాంతాలలో 165 స్థానాలు ఉండగా, టీవీకే 47 స్థానాలలో ఆధిక్యం ప్రదర్శించడం విశేషం. ఇక, డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులు గెలుపొందిన చాలా చోట్ల టీవీకే అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. డీఎంకేకు కంచుకోటగా ఉన్న చెన్నైలో 16 నియోజకవర్గాలు ఉండగా కేవలం రెండు చోట్లే ఆ పార్టీ గెలిచింది. మిగిలినవన్నీ టీవీకే ఖాతాలో చేరాయి. 
సంకీర్ణం దిశగా..
⇒ విజయ్ అధికార పగ్గాలు చేపట్టేందుకు మరో పదికిపైగా స్థానాలు అవసరం అవుతున్న నేపథ్యంలో డీఎంకేతో సీట్ల పంచాయతీ వివాదాలను ఎదు ర్కొన్న ఆ కూటమిలోని కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న చర్చ ఊపందుకుంది. అదే సమయంలో అన్నాడీఎంకే కూటమిలోని పీఎంకే సైతం మద్దతుగా నిలిచే అవ కాశాలు ఉండడంతో తమిళనాట ఈసారి సంకీర్ణ ప్రభుత్వం తథ్యంగా కనిపిస్తోంది. విజయ్ సైతం తన తొలి మహానాడులో సంకీర్ణ ప్రభుత్వానికి రెడీ అని స్పష్టంగా ప్రకటన చేయడం గమనార్హం.
⇒ తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. డీఎంకే నేతృత్వంలోని కూటమిలో ఉన్న కాంగ్రెస్ 28 చోట్ల, దివంగత విజయకాంత్ సతీమణి ప్రేమలత విజయకాంత్ సారథ్యంలోని డీఎండీకే 10 చోట్ల, ఎంపీ తిరుమావళవన్ నేతృత్వంలోని వీసీకే 8 చోట్ల, సీపీఎం, సీపీఐ చెరో ఐదు చోట్ల, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ రెండు స్థానాల్లో పోటీ చేశాయి. 58 స్థానాలు పైన పేర్కొన్న మిత్రులకు పోగా మిగిలిన 176 స్థానాలలో డీఎంకే ఉదయ సూర్యుడి చిహ్నంతో అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో డీఎంకే అభ్యర్థులు 164 మంది బరిలో నిలవగా 12 మంది చిన్న పార్టీలకు చెందిన అభ్యర్థులున్నారు.
⇒ అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమిలో ఉన్న బీజేపీ 27 చోట్ల, పీఎంకే 18 చోట్ల, ఏఎంఎంకే 11 చోట్ల, టీఎంసీ 5 చోట్ల, ఏజేకే 2 చోట్ల, టీఎంఎంకే, పురట్చి భారతం, పుదియ నిధి కట్చిలు తలా ఒకచోట పోటీ చేశాయి. ఇందులో టీఎంసీ బీజేపీ కమలం చిహ్నంతో పోటీ చేసింది. అన్నాడీఎంకే 168 చోట్ల బరిలో నిలిచింది.
⇒ ఎన్నికలలో మార్పు నినాదంతో తొలిసారిగా, ఒంటరిగా బరిలో దిగిన సినీ నటుడు విజయ్ టీవీకే పార్టీ 233 స్థానాలలో పోటీ చేసింది. (సేలం ఎడప్పాడిలో పార్టీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది). మరో నటుడు సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చి 234 స్థానాలలో పోటీ చేసింది. ఇందులో 50 శాతం మంది మహిళలకు పోటీ చేసే అవకాశం కల్పించారు.
విజయ్.. విన్నింగ్ షాట్
సాక్షి, అమరావతి: 2021 తమిళనాడు శాసనసభ ఎన్నికలు... పోలింగ్ రోజు విజయ్ చెన్నైలోని తన ఇంటి నుంచి సైకిల్ తొక్కుకుంటూ పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేసి వచ్చారు. రాజకీయాల్లోకి వస్తానని తొలిసారిగా సంకేతం ఇచ్చారు.. ఐదేళ్ల తర్వాత ఆయన రాజకీయ తొలి ఇన్నింగ్స్‌లోనే అధికార డీఎంకే ప్రభుత్వాన్ని తొక్కేస్తారని ఎవరూ ఊహించలేదు.. 50 ఏళ్లుగా బలంగా పాతుకు పోయిన డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల కూకటి వేళ్లను పెకలిస్తారని దిగ్గజ విశ్లేషకులు కూడా అంచనా వేయలేదు.. అంచనాలను తలకిందులు చేస్తూ మొదటి ఇన్నింగ్స్‌లోనే విన్నింగ్ షాట్ కొట్టిన సరికొత్త రాజకీయ సూపర్‌స్టార్‌గా విజయ్ నిలిచారు.
తల్లిదండ్రులను కలసి ఆశీర్వాదం..
విజయ్ రాత్రి 7 గంటలకు చెన్నై అడయార్‌లోని నివాసంలో తల్లిదండ్రులను కలసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం నుంగంబాకంలోని కౌంటింగ్ కేంద్రం వద్దకు వెళ్లి ఎన్నికల ధృవీకరణ పత్రం తీసుకున్నారు. దారి పొడవునా నీరాజనం పలికిన అభిమానులకు విజయ్ అభివాదం చేశారు.


