సాక్షి, చెన్నై: డీఎంకే, అన్నాడీఎంకే ద్రవిడ పార్టీల ఐదు దశాబ్ధాల పాలనా శకానికి టీవీకే ముగింపు పలికింది. తమిళనాడులో 1962లో ద్రవిడ పార్టీగా డీఎంకే ఎన్నికలకు వెళ్లగా 50 స్థానాలతో ప్రతిపక్షంలో కూర్చుంది. 1967 ఎన్నికల్లో అన్నాదురై నేతృత్వంలో డీఎంకే తొలిసారిగా అ«ధికార పగ్గాలు చేపట్టింది. ఆయన మరణం తర్వాత 1969లో కరుణానిధి డీఎంకే అధ్యక్షపగ్గాలతో పాటు తమిళనాడు సీఎం కురీ్చని కైవసం చేసుకున్నారు.
ఈ క్రమంలో సినీ నటుడు ఎంజీఆర్, కరుణానిధి మధ్య నెలకొన్న వివాదంతో అన్నాడీఎంకే ఆవిర్భవించింది. 1977 ఎన్నికల్లో తొలిసారిగా ఎంజీఆర్ నేతృత్వంలోని అన్నాడీఎంకే అధికారాన్ని దక్కించుకుంది. మరణించే వరకు ఎంజీఆర్ సీఎంగా కొనసాగారు. తర్వాతి పరిణామాలతో 1989లో వచ్చిన ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి రెండు పార్టీల ప్రభుత్వాలు వరుసగా మారుతూ వచ్చాయి.
1991లో అన్నాడీఎంకే, 1996లో డీఎంకే, 2001లో అన్నాడీఎంకే, 2006లో డీఎంకే అధికారం చేపట్టాయి. 2011 ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన దివంగత సీఎం జయలలిత తన రాజకీయ గురువు ఎంజీఆర్ రికార్డును తిరగరాస్తూ 2016లో మళ్లీ గెలిచారు. ఆమె మరణం తదుపరి పరిణామాలతో 2021 ఎన్నికల్లో డీఎంకే గద్దె నెక్కింది. డీఎంకే దివంగత అధినేత కరుణానిధి వారసుడైన స్టాలిన్ సీఎంగా పగ్గాలు చేపట్టారు. ఇలా డీఎంకే, అన్నాడీఎంకే అంటూ అధికారం సాగుతూ వచ్చిన సమయంలో తమిళనాడులో మూడోశక్తిగా అవతరించిన విజయ్ రూపంలో ద్రవిడ పార్టీల అధికార శకానికి ముగింపు పలికినట్లయింది.


